Homeతెలుగు Newsవైసీపీలో చాలా అవమానించారు: వంగవీటి రాధా

వైసీపీలో చాలా అవమానించారు: వంగవీటి రాధా

13 11

విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. ఈ అవమానాలు మరొకరికి జరగకూడదని అన్నారు. తన తండ్రి అభిమానులను సంతృప్తి పరిచేందుకే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లానన్నారు. విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లావంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి తనను మందలించారన్నారు. విగ్రహావిష్కరణకు వెళ్లనివ్వనివారు ఇంకెక్కడికి వెళ్లనిస్తారని ఆయన నిలదీశారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలని ఆయన సూచించారు.

అన్ని కులాలు, మతాలు, పార్టీల్లో తన తండ్రి రంగా అభిమానులున్నారని రాధాకృష్ణ చెప్పారు. తనను చంపేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపులు కూడా వచ్చాయని.. ఎవరి దాడులకు భయపడేవాడిని కాదన్నారు. తనకు ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమని.. రంగా అనే వ్యవస్థను బతికించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజాజీవితంలో కొనసాగాలనుకుంటున్నానని.. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేని పార్టీలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. అందుకే వైసీపీలో కొనసాగి ఏమీ చేయలేననే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను చెప్పే ప్రతి మాట వాస్తవమని, ఈ విషయంలో వైసీపీలో చాలా మందికి తెలుసన్నారు. కానీ వాళ్లు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదని చెప్పారు. ఆత్మాభిమానం చంపుకొని, అవమానాలు భరిస్తూ ఇన్నాళ్లూ వైసీపీలో కొనసాగామన్నారు.

ఏ పార్టీలో చేరబోతున్నారని మీడియా ప్రశ్నించినా రాధా సమాధానం ఇవ్వలేదు. తన తండ్రి ఆశయం కోసమే పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన తండ్రిని అన్ని పార్టీల వారు అభిమానిస్తారని.. ఆయన విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల నేతలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది తాను డబ్బు తీసుకొని పార్టీ మారబోతున్నానని చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. తన తండ్రి పేరును ఎప్పుడూ చెడగొట్టనన్నారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి కొందరు వ్యక్తులు చేసిన పనిని.. ఏదో ఒక పార్టీకి పూయడం మంచిది కాదంటున్నారు వంగవీటి రాధా.

రాధా అనే వ్యక్తికి పదవులు ముఖ్యం కాదు.. ప్రజల సేవ చేయడం, రంగా ఆశయం కోసం పని చేయడమే లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు తనను టీడీపీలోకి గౌరవంగా ఆహ్వానించారని రాధా వెల్లడించారు. నీలాంటి వాళ్లు సమాజానికి ఉపయోగపడతారని సీఎం అన్నారన్నారు. అందుకే విజయవాడలో పేదలకు పట్టాలు ఇవ్వమని చంద్రబాబుగారిని కోరుతున్నానని.. పెద్దమనిషిగా తన కోరికను మన్నిస్తారని భావిస్తున్నానని రాధా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కొన్ని లోపాలున్నాయి.. వాటిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. రంగా ఆశయాన్ని ఎవరు నెరవేరిస్తే వాళ్లను నెత్తిని పెట్టుకుని చూస్తామన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu