మీనాకుమారి బయోపిక్ లో విద్యాబాలన్!

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. జీవిత చరిత్రల ఆధారంగా రూపొందుతోన్న సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారణంగానే సినీరంగం ఇటువైపుగా మొగ్గుచూపుతోంది. తాజాగా ఒకప్పటి నటి మీనాకుమారి బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ మీనాకుమారి జీవితంపై సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మీనాకుమారి అందంలోను, అభినయంలోనూ కీర్తి ప్రతిష్టలు సంపాదించింది. ఆమె కెరీర్ లో ఎన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేసింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను కూడా చవిచూసింది. అలాంటి నటిపై సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు.
మీనాకుమారిపై బయోపిక్ ను తెరకెక్కించడానికి కొంతకాలం క్రితమే ప్లాన్ చేశారు. ఆమె పాత్రకు గాను కంగనా రనౌత్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపిక పట్ల మీనాకుమార్ సోదరుడు అసహనాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు 
సమాచారం. అయితే ఈసారి మీనాకుమారి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.