కుమార్తెను ఉద్దేశించి షారూక్‌ ఖాన్‌ ట్వీట్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుంది. లండన్‌లోని ఆర్డింగ్లీ కాలేజీ నుంచి సుహానా నిన్న డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కార్యక్రమానికి షారూక్‌, గౌరీ దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షారూక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆర్డింగ్లీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యింది. చివరి పిజ్జా.. చివరి రైలు ప్రయాణం.. కానీ నిజమైన ప్రపంచంలోకి తొలి అడుగు పడింది ఇప్పుడే. ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదు’ అని షారూక్‌ కుమార్తెను ఉద్దేశించి రాసుకొచ్చారు.

డిగ్రీ పట్టాతో పాటు కాలేజీలో డ్రామాకు సహకారం చేసినందుకు గానూ సుహానా రసెల్‌ కప్‌ను కూడా అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను గౌరీఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తండ్రిలాగే సుహానా కూడా సినిమాల్లోకి రావాలని అనుకుంటోంది. గతంలో షారూక్‌ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ‘నా పిల్లలు నటులు కావాలని నేను బలవంతపెట్టట్లేదు. కానీ సుహానాకు నటి కావాలనే ఆసక్తి ఉంది. స్కూల్‌ పూర్తయిన తర్వాత తను నటనలో శిక్షణ తీసుకుంటుంది’ అని షారూక్‌ అన్నారు.

అయితే సినిమాల్లోకి రాకముందే సుహానాకు చాలా స్టార్‌డమ్‌ వచ్చేసింది. సుహానా ఎక్కడికి వెళ్లినా ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఆ మధ్య వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం సుహానా ఫొటో సెషన్‌లో పాల్గొంది. అప్పట్లో ఆ ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి.