‘విరాటపర్వం’ మూవీ రివ్యూ

రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ: విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్‌). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్‌ దళ నాయకుడు అరణ్య అలియాస్‌ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి.. ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్‌, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్‌ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్‌ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే.

విశ్లేషణ: టాలీవుడ్‌లో నక్సలిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పారు. కానీ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్‌. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుకు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరంగల్‌కు చెందిన మహిళ సరళ(సినిమాలో వెన్నెల అని పేరు మార్చారు)ను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సంఘటనను కథగా తీసుకోని మంచి సంబాషణలతో అద్భుతంగా విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కించాడు. సరళ హత్య విషయంలో తప్పు పోలీసులదా? లేదా నక్సలైట్లదా? అనే అంశాన్ని దర్శకుడు ఎంతో సున్నితంగా,ఎమోషనల్‌గా తెరపై చూపించాడు.

‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ’ అంటూ సినిమా స్టార్టింగ్‌ నుంచే ప్రేక్షకులను వెన్నెల లవ్‌స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం వెన్నెల చుట్టే తిరుగుతుంది. వెన్నెల కుటుంబ నేపథ్యం, పెరిగిన విధానం, విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం..అతని కోసం కన్నవారిని వదిలి వెల్లడం.. చివరకు పోలీసుల చేతికి దొరకడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. తన తండ్రిపై పోలీసులు దాడి చేసినప్పుడు.. వారితో వెన్నెల వాగ్వాదం చేయడం ఆకట్టుకుంటుంది. ఇక రవన్నగా రానా ఎంట్రీ అయితే అదిరిపోతుంది. రవన్న కోసం దాచుకున్న బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తే.. దానిని కాపాడుకునేందుకు వెన్నెల చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క సీన్‌ తెలియజేస్తుంది. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్‌. ఫస్టాప్‌లో కొన్ని సీన్స్‌ రిపీటెడ్‌గా అనిపించినా.. సాయి పల్లవి తనదైన నటనతో బోర్‌ కొట్టించకుండా చేసింది. ఇంటర్వెల్‌ సీన్‌ కూడా బాగుంటుంది.

సెకండాఫ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీసు స్టేషన్‌లో ఉన్న వెన్నెలను రవన్న దళం చాకచక్యంగా తప్పించడం.. ప్రొఫెసర్‌ శకుంతల (నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథలో మరింత స్పీడ్‌ పెగుతుంది. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. రవన్న తన తల్లిని కలిసి వచ్చే క్రమంలో జరిగే ఎదురుకాల్పుల్లో రవన్న, వెన్నెల కలిసి ఫైరింగ్‌ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశం అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్‌ అయితే కంటతడి పెట్టిస్తుంది. చేయని తప్పుకు వెన్నెల బలైపోయిందనే బాధతో ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు.

దర్శకుడు వేణు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’ అని రాహుల్‌ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం క‌న్న‌వాళ్ల‌ను, క‌ట్టుకున్న‌వాళ్ల‌ను వ‌దిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వ‌స్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే తెలంగాణలో అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండోవో, ప్రజల జీవన పరిస్థితి ఏరకంగా ఉండేదో చక్కగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు వేణు ఊడుగుల ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు.

నటీనటులు: వెన్నెల పాత్రని రాసుకున్నప్పుడే సాయి పల్లవి ఊహించుకున్నానని సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు వేణు చెప్పాడు. సాయి పల్లవి- రానా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్‌ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రీక్లైమాక్స్‌లో ప్రియమణి, నవీన్‌ చంద్రల కారణంగానే కథ మలుపు తిరుగుతుంది. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్‌, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. వారి పాత్రల నిడివి తక్కువే అయినా.. గుర్తుండిపోతాయి.రాహుల్‌ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్‌ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా.. కథతో పాటు వస్తాయి. నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

టైటిల్‌ : విరాటపర్వం
నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్‌, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర తదితరులు
దర్శకత్వం:  వేణు ఊడుగుల
నిర్మాణ సంస్థ: : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు
సంగీతం : సురేశ్‌ బొబ్బిలి

హైలైట్స్‌‌: హీరో, హీరోయిన్‌ల నటన
డ్రాబ్యాక్స్‌: ఫస్టాప్‌లో కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌
చివరిగా: ఓ స్వచ్చమైన ప్రేమ కథ ‘విరాటపర్వం’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates