అది వరలక్ష్మీ వ్యక్తిగత అభిప్రాయం: హీరో విశాల్‌

హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ తనపై నటి వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. నడిగర్‌ సంఘం గత ఎన్నికల సమయంలో శరత్‌కుమార్‌, విశాల్‌ల మధ్య మొదలైన వార్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్‌ పోటీ చేయని విషయం తెలిసిందే. అయితే తాజాగా శరత్‌కుమార్‌ను ఘాటుగా విమర్శిస్తూ ఓ వీడియో విడుదల చేశారు విశాల్‌. దీనిపై వరలక్ష్మి తీవ్రంగా మండిపడింది. తన తండ్రి ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విశాల్‌పై ఉన్న నమ్మకం ఈ వీడియోతో పోయిందని, నా ఓటును కూడా విశాల్‌ కోల్పోయాడని పేర్కొంది. వాసతవానికి వీరిద్దరూ గతంలో ప్రేమాయణం సాగించారని వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అప్పట్లో విశాల్‌ తన తండ్రిపై విమర్శలు చేసినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా మాట్లాడటం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇటీవల విశాల్‌కు నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. మరోవైపు నటి రాధిక కూడా ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో మండిపడిండి. ‘శరత్‌కుమార్‌ సంఘంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించావు. ఇప్పటి వరకు నిరూపించలేకపోయావు. ఏ మాత్రం సిగ్గులేకుండా ఇంకా అవే మాటలు మాట్లాడుతున్నావ్‌. నీ వీపుపై అవినీతి మూట పెట్టుకొని శరత్‌కుమార్‌ను విమర్శించడం ఎందుకు. సిగ్గుగా లేదా..? నిర్మాతల మండలిలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ చేసి, న్యాయస్థానం వాకిట నిల్చుని ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో వీడియో విడుదల చేయడానికి నీకు అర్హత ఉందా..? అని రాధిక ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్యాఖ్యలపై విశాల్‌ స్పందించారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆమెకు మాట్లాడే హక్కు ఉందని చెప్పారు.