బిగ్‌బాస్‌-3 హోస్ట్‌ ఎవరు?.. రోజుకో పేరు హల్‌చల్‌


తెలుగులో బిగ్‌బాస్‌ రీయాలిటీ షో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని సీజన్‌ 3 సిద్థమౌవుతుంది. కాగా సీజన్‌-1 కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ షో సూపర్‌ హిట్‌ అయింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా పర్ఫెక్ట్‌ అన్నారు. షో మొదటి ఎపిసోడ్‌ సుమారు 16.18 టీఆర్‌పీ (టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌), మొదటివారం 9.24 టీఆర్‌పీను నమోదు చేసింది. ‘నా టీవి’ అనే ఎన్టీఆర్‌ మేనరిజమ్‌ బాగా క్లిక్‌ అయింది.

ప్రతి సినిమా షెడ్యూల్, ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించడం కుదరకపోవడంతో సెకండ్‌ సీజన్‌లో హోస్ట్‌గా తప్పుకున్నారు ఎన్టీఆర్‌. సీజన్‌-2కి హోస్ట్‌గా నాని ఎంట్రీ ఇచ్చాడు. ‘నా నీ టీవీ’ అంటూ నాని మేనరిజమ్‌ కూడా ఆకట్టుకుంది. సెకండ్‌ సీజన్‌ కూడా మంచి హిట్టే. సెకండ్‌ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ 15.05, మొదటి వారంలో 7.93 టీ ఆర్‌పీ నమోదయ్యాయి. తర్వాతి సీజన్‌లో కనిపించబోనని షో ఫైనల్‌ రోజే నాని స్పష్టం చేశారు. మూడో సీజన్‌ జూన్‌లో స్టార్ట్‌ కానుంది. ప్రస్తుతం హోస్ట్‌ ఎవరన్న టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కారణంగా ఈసారి కూడా ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ ను మిస్‌ అవుతారని వినిపిస్తోంది.

అయినప్పటికీ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని ‘బిగ్‌బాస్‌’ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నాగార్జున కూడా బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కనిపిస్తారని టాక్‌. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ను నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బిగ్‌బాస్‌’ కు హోస్ట్‌గా నాగ్‌ కూడా పర్ఫెక్ట్‌ అని పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండను హోస్ట్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అందుకే ఆయన్ను బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా ఒప్పించేందుకు స్టార్ మా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ డేట్స్ కుదరకపోతే నాగార్జుననే కన్ఫర్మ్ చేసుకోవాలని బిగ్ బాస్ 3 నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరిలో బిగ్‌బాస్‌ హోస్ట్‌ ఎవరన్నది మాత్రం నిర్వాహకుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. జూన్‌లో ప్రారంభం కాబోయే మూడో సీజన్‌ ప్రీ–ప్రొడక్షన్‌ పనులు నడుస్తున్నట్టు, సెట్‌ ఎక్కడ వేయాలి? కంటెస్టెంట్స్‌ ఎవరనే డిస్కషన్స్‌ జరుగుతోందని సమాచారం.