‘యాత్ర’ ట్రైలర్‌..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు‌. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది.

పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో పాటు, పాదయాత్ర సాగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు ట్రైలర్‌లో ప్రతిబింబించింది. వైఎస్సార్‌ పాదయాత్రలో ప్రజలతో మమేకమైన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి’, ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్‌ ఆకర్షించేదిగా ఉంది.