హీరో రామ్‌, ఛార్మిని కంటతడి పెట్టించిన అభిమాని

ఓ అభిమాని హీరో రామ్‌, నటి ఛార్మితో కంటతడి పెట్టించాడు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఈ నెల 18న విడుదల కాబోతోంది. రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా విజయం సాధించాలని ప్రార్థిస్తూ సందీప్‌ అనే అభిమాని తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కారు. సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. దీన్ని చూసిన రామ్‌ భావోద్వేగంతో స్పందించారు. ‘ప్రియమైన సందీప్‌ నీ వీడియో చూశాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా. నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది, బాధించింది, షాక్‌కు గురి చేసింది. మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై కురిపించడానికి నేనేం చేశానో అర్థం కావడం లేదు. కానీ మీలాంటి వారి కోసం నా గుండెకొట్టుకుంటూనే ఉంటుంది. నిజంగా నేను కృతజ్ఞుడ్ని’ అని ఓ పోస్ట్‌ చేశారు.

సందీప్‌ మోకాలిపై మెట్లు ఎక్కుతుండగా తీసిన వీడియోను ఛార్మి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నువ్వు నన్ను ఏడిపించావు సందీప్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బ్లాక్‌బస్టర్‌ కావాలని నీ మోకాలిపై తిరుమలకు వెళ్లిన నీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నువ్వు మాపై ఎంతో ప్రేమ, అనురాగం చూపించావు’ అని ట్వీట్‌ చేశారు.