వైరల్‌ వీడియో పై జొమాటో కీలక నిర్ణయం..

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటోలో పనిచేస్తున్న ఓ డెలివరీ బాయ్‌ చేసిన ఘనకార్యం కారణంగా సదరు సంస్థ ఓ నిర్ణయానికొచ్చింది. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ట్యాంపర్‌ ప్రూఫ్‌ టేప్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఆహారాన్ని ప్యాక్‌ చేసే ప్యాకెట్లు, డబ్బాలకు ఈ ట్యాంపర్‌ ప్రూఫ్‌ టేప్‌లు అంటించనున్నారట. దీని ద్వారా కస్టమర్‌ ఆ టేప్‌ను కత్తిరిస్తే తప్ప ప్యాకెట్లు తెరుచుకోవు. ఒకవేళ డెలివరీ బాయ్స్‌ వాటిని తెరవడానికి ప్రయత్నిస్తే మళ్లీ అంటించడానికి వీలు ఉండదు. కస్టమర్‌కు ఇచ్చే ఆహారాన్ని డెలివరీ బాయ్‌ ఎంగిలి చేసిన ఘటన వంటివి గతంలో తమ సంస్థలో ఎప్పుడూ జరగలేదని జొమాటో పేర్కొంది. ఇలాంటి ఘటనలు ఇతర కంపెనీల్లోనూ చాలా అరుదుగా జరుగుతుంటాయని తెలిపింది. అంతేకాకుండా డెలివరీ బాయ్స్‌కి కూడా ప్రత్యేకించి శిక్షణ ఇప్పిస్తామని చెప్పింది.

మధురైకు చెందిన ఓ డెలివరీ బాయ్‌ కస్టమర్‌కు డెలివరీ ఇచ్చే ఆహారాన్ని ఎంగిలి చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో కొద్ది నెలల క్రితమే బయటకు వచ్చినప్పటికీ జొమాటో ఇటీవల స్పందించి క్షమాపణలు చెప్పింది.