‘ఆటగదరా శివ’ పాట విడుదల చేసిన వెంకటేష్

చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో యువ కథానాయకుడు ఉదయ్‌ శంకర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆటగదరా శివ’. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు చంద్ర సిద్ధార్థ మాట్లడుతూ.. ఓ ఖైదీకి పడిన ఉరిశిక్షను అమలు చేయడానికి అధికారుల ఆదేశం మేరకు ఇంటి నుంచి బయలు దేరతాడు ఓ తలారి. అదే సమయంలో ఆ ఖైదీ జైలు నుంచి తప్పించుకుంటాడు. కొండలు, గుట్టలు దాటుకుని అనుకోకుండా తనని ఉరి తీయడానికి వస్తున్న తలారి వాహనంలోనే ఎక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఖైదీకి ఉరిశిక్ష పడిందా? వారి ప్రయాణం ఎలా సాగింది? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. రాక్లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతోంది.

 

అగ్ర కథానాయకుడు విక్టరీ హీరో వెంకటేష్‌ ఈరోజు (గురువారం) ‘రామ రామ రామ రే…రామ రామ రామ రే’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాటకు పులగం చిన్నారాయణ సాహిత్యం అందించగా, వాసుకీ వైభవ్‌ స్వరాలు సమకూర్చారు. సంగీత కత్తి, పూజ, ప్రణవ్‌, కార్తీక్‌, బృంద ఆలపించారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ పాట సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో ‘జబర్దస్త్’‌ నటులు హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన ‘రామా రామారే’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 14న విడుదల కానుంది.