రాజ్ తరుణ్ సీన్ అయిపోయినట్లేనా..?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ గుర్తింపును కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈయంగ్ హీరో నటిస్తున్న సినిమాలు అన్నీ పరాజయం సాధించడంలో రాజ్ తరుణ్ చేసిన వ్యూహాత్మక తప్పులు కారణం అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోయిన నేపధ్యంలో ఈ తీవ్రపోటీ వాతావరణంలో రాజ్ తరుణ్  ఉనికిని చాటుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. కొత్త దర్శకులు అదే విధంగా యంగ్ డైరెక్టర్స్ కూడ రాజ్ తరుణ్ తో సినిమాలు తీసే విషయంలో పెద్దగా ఆసక్తి కనపరచడంలేదు అన్న వార్తలు వస్తున్నాయి.

అంతేనా రాజ్ తరుణ్ సినిమాలకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది విడుదలైన ‘రంగుల రాట్నం’ కూడా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలో తను నటించిన ‘రాజుగాడు’ సినిమాను కూడా వాయిదా వేశారు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర రాజ్ తరుణ్ సినిమాను పక్కన పెట్టి నిఖిల్ తో చేసిన ‘కిరాక్ పార్టీ’ను ముందుగా విడుదల చేస్తున్నాడు. ఇక ఈ నెల దాటిపోతే పెద్ద సినిమాలు బరిలోకి దిగుతాయి. అప్పుడు ‘రాజుగాడు’ సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమని అంటున్నారు. నటుడిగా టాలెంట్ ఉన్నా కెరీర్ పరంగా మాత్రం ఈ యువనటుడు ఈదుకు రాలేకపోతున్నాడు.