వైఎస్సార్‌ తండ్రిగా జగ్గుబాయ్‌

దివంత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వైఎస్సార్‌పాత్ర పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వి.రాఘవ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే ఇందులో వైఎస్సార్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో సీనియర్‌ నటుడు జగపతిబాబు నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో రాజారెడ్డి పాత్రకు జగపతి సరిగ్గా సరిపోతారని భావించి మూవీ యూనిట్‌ ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 1925లో పుట్టిన రాజారెడ్డికి రాయలసీమ ప్రజల్లో ఎంతో గౌరవం ఉంది. 1998లో సంభవించిన బాంబు దాడిలో రాజారెడ్డి కన్నుమూశారు. ఈ విషయాలన్నీ సినిమాలో ప్రస్తావించనున్నారట.

మరోపక్క ప్రముఖ యాంకర్‌ అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయనాయకురాలి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది.