షూటింగ్‌లో గాయపడ్డ ధనుష్!

మారి-2 చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌కు గాయాలయ్యాయి. క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతుండగా ధనుష్‌ కుడి కాలికి, ఎడమ చేతికి గాయాలైనట్లు తెలిసింది. చిత్రంలో విలన్‌ పాత్రధారి టోవినో థామస్‌ కూడా స్వల్ఫంగా గాయపడినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. అయితే గాయాలతోనే ధనుష్‌ షాట్‌ పూర్తి చేసి వైద్యానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ధనుష్‌ కోలుకునేదాకా షూటింగ్‌ను నిలిపేసినట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి.

కంగారుపడాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ధనుష్‌ ఓ ట్వీట్‌ చేశాడు. సాయి పల్లవి హీరోయిన్‌ కాగా వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళికి మారి-2 రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.