హైదరాబాద్‌లో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రావూరులో దళితులపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన సివిల్ పంచాయితీలో పోలీసులు తల దూర్చడం వల్లే వివాదం చెలరేగిందని, దాన్ని పోలీసులపై జరిగిన దాడిగా బూతద్దంలో చూపారని పవన్ వ్యాఖ్యానించారు. కొందరు ప్రజాప్రతినిధులు అధికారుల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని పవన్ ఆరోపించారు.

ఓ వైపు దళిత తేజం పేరుతో ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరోవైపు దళితుల్ని అణచివేసే చర్యలకు దిగుతున్నారని ప్రభుత్వంపై పరోక్షంగా పవన్ విమర్శలు గుప్పించారు. పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని సమావేశం అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు సరిగా లేవనే ఆందోళన సమావేశంలో వ్యక్తమైంది. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ఎవరు వ్యవహరించినా జనసేన చూస్తూ ఊరుకోదని, రావూరు దళితులకు ప్రభుత్వం న్యాయం చేసేవరకూ పోరాడుతుందని స్పష్టం చేశారు. దళితులపై కేసులు ఎత్తివేసినపుడే సమస్య శాంతియుతంగా పరిష్కారమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.













