Homeతెలుగు Newsనేను పాతిక సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చా: పవన్

నేను పాతిక సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చా: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు (ఆగస్ట్ 10) నర్సాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జనసేన సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక ఐదేళ్లు ఉండి 2019 నాటికి వెళ్లిపోదామని రాలేదు. నేను ఏ ఒక్క కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు, నాకు కులాలు ఆపాదించాలని చంద్రబాబు చూస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. నేను కులాన్ని నమ్ముకున్నట్టయితే టీడీపీకి మద్దతిచ్చే వాడిని కాదని, కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. కులాలు బాగుపడటం లేదు, కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయని అన్నారు.

 

7a 1అందరికీ సమన్యాయం చేయడమే నా ధ్యేయం, నేను పాతిక సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చాను, కన్నీళ్లు తుడవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. నేను ఒక్కరి కోసం రాలేదు, కోట్లాది యువతకు అండగా ఉండేందుకు వచ్చాను. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కన్నీళ్లే.. మీ అందరి కన్నీళ్లు తుడవడానికి వచ్చాను అని అన్నారు. రెండు రాష్ట్రాలు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నాయని అన్నారు. 2014లో పోటీ చేయకపోవడానికి కారణం అప్పటికి నేను పూర్తిగా అర్ధం చేసుకోలేదనే.. ఇప్పుడు నేను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నా.. మీకు అండగా నిలబడతా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి చూస్తే బాధ కలుగుతుందని.. జిల్లా నుంచి టీడీపీకి 15 స్థానాలు గెలిపించి ఇస్తే జిల్లాకు ఏమీ చేయలేకపోయారు.. కనీసం లంక గ్రామాలకు రక్షణ గోడ కల్పించలేకపోయారు.. చెత్తను తీసుకెళ్లి గోదావరిలో కలిపారు. తల్లిగా భావించే గోదావరిని డంపింగ్ యార్డుగా మార్చారని మండిపడ్డారు. మత్స్యకారుల సమస్యలు నన్ను బాధకలిగించాయి, మత్స్య కారులకు కోల్డ్ స్టోరేజీ ఉండాలి, వేటకు వెళ్లే మత్స్యకారులకు అండగా ఉండాలి.

పేరుపాలెం బీచ్ అబివృద్ధి చేస్తే ఎంతోమంది యువతకు ఉపాధి లభిస్తుంది. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా అవకతవకలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రతిభ ఉన్న యువత చాలా ఉంది, వారికోసం ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, జనసేన మేనిఫెస్టోలో దానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని పవన్ అన్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు.. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని పవన్ అన్నారు.

7 8

నర్సాపురంను టూరిజం హబ్‌గా చేసి యువతకు ఉద్యోగాలు లభించేలా చేస్తామని, మత్స్యకారులకు ఉపాధి లభించేలా జెట్టీలు నిర్మించే లాంటి ఆలోచన చేస్తామని అన్నారు.మహిళా సాధికారత కోసం డచ్ దేశస్తులు నేర్పించిన లేస్ కళను అభివృద్ది చేస్తామని, లేస్ కళా నైపుణ్యం కలిగిన వారు 50వేల మంది మహిళలు ఉన్నారని, వారికి వృత్తి నైపుణ్యం పెంచేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పవన్ అన్నారు. మర పడవలు, బోట్లు నిర్మాణానికి ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి మహిళ పేరున సొంత గృహాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెడతామని అన్నారు. అలాగే చేనేత కార్మికులకు అండగా జనసేన నిలబడుతుందని, వారికోసం చేనేత పార్క్‌ను ప్రారంభిస్తామని, రైతుల కోసం మామిడి సాగుచేసే వారికి కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చే బీజేపీ ఏపీలో అర్హత కోల్పోయిందని పవన్ అన్నారు. టీడీపీని విమర్శిస్తే బీజేపీకి తొత్తులని మాట్లాడతారు. నరేంద్ర మోడీ నా చుట్టం కాదని గుర్తుచేశారు. ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందనే అప్పట్లో మద్దతిచ్చామని, టీడీపీ కాపులను, బీసీలను మోసం చేసింది, వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా మాట మార్చారన్నారు. నేను కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తిని కాదు, అందరికీ సమన్యాయం చేయడమే నా ధ్యేయం. నాకు వేరే జీవితం లేదు.. నిరంతరం ప్రజా సమస్యలపైనే పోరాడతానని పవన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలు చాలా కీలకమని నేను ముఖ్యమంత్రి అయితే మీ ఇంట్లోని ఒకరు సీఎం అయినట్టేనని పవన్ స్పష్టం చేశారు. మీ సమస్యలుంటే జనసేన వద్దకు రండని పిలుపునిచ్చారు. నేను సినిమాల్లో సరదాగా ఉంటానని రాజకీయాల్లో బాధ్యతగా ఉంటానని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu