HomeTelugu Big Storiesపవన్ కల్యాణ్ పోటీపై నేతల్లో రసవత్తర చర్చ

పవన్ కల్యాణ్ పోటీపై నేతల్లో రసవత్తర చర్చ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏలూరులో పవన్‌కల్యాణ్‌ ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ మొదలైంది. గతంలో ఏలూరు పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లును పవన్‌ పేరిట నాయకులు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి చిరునామాతో ఓటుహక్కు పొందారు. పవన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గత నెల 27న భీమవరంలో పర్యటించిన పవన్ తన పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయంటూ తనకు జిల్లాపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతే కాకుండా భీమవరంలోనే బస చేశారు. మరో 10 రోజుల పాటు భీమవరంలోనే ఉండి ఇక్కడి సమస్యలను పూర్తిగా అధ్యయనం చేస్తానని తెలిపారు.

7s

“మా తాత పెనుగొండలో పోస్టుమేన్‌గా పనిచేశారు. మా నాన్న మొగల్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేశారు. మా నాన్న మాకున్న రెండెకరాల భూమిని ఆడపిల్లల పెళ్లిళ్లకోసం అమ్మేశారు. ఆ భూమి ఉంటే ఇక్కడే ఉండిపోయేవాడిని. మా పూర్వీకులు ఇక్కడే నివసించినా.. నేనున్నది తక్కువ. చిన్నప్పుడు రెండు సార్లు వచ్చా. నరసాపురంలో తప్పిపోయా. అప్పట్లో కానిస్టేబుల్‌ రక్షించి మా నాన్నకు అప్పగించారు. మొగల్తూరులో చెట్టెక్కి జామకాయలు కోసిన తీపి జ్ఞాపకం గుర్తుందీ. ఈ పచ్చని జిల్లాను చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తోంది. మా పూర్వీకుల మూలాలున్న ప్రాంతంగా ఈ జిల్లా అంటే నాకు ఎంతో అభిమానం. జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను అని భీమవరం పర్యటనలో పవన్ వ్యాఖ్యానించారు.

7c

ఏడాది కిందట ఏలూరు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ జిల్లాలోనే ఓటుహక్కు నమోదు చేయించుకుంటానని చెప్పారు. అలాగే ఏలూరు నగరంలోని పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అదే ఇంటి నంబరుతో పవన్‌ ఓటుహక్కు నమోదు చేశారు. గత నెలలో ఓటరు గుర్తింపు కార్డు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తన సొంత జిల్లా కేంద్రం అయిన ఏలూరు నుంచి పోటీ చేయాలని ఇక్కడి అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నాయకులు పవన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎవరికి వారు మాదగ్గర పోటీ చేస్తారంటే మా దగ్గర చేస్తారని విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలకు మద్దతుగా అనేక సమీకరణాలు చెబుతూ వారి వాదనలను సమర్థించుకుంటున్నారు.

7b

రాష్ట్రంలోని 175 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని పవన్‌ కల్యాణ్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. దానికనుగుణంగానే పలు నియోజకవర్గాల నుంచి నాయకులను ఆహ్వానించడం వంటివి ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. ఆయన పూర్వీకులు మొగల్తూరులో నివసించారు. మొగల్తూరు నరసాపురం నియోజకవర్గం పరిధిలో ఉంది. పవన్‌కల్యాణ్‌ మా ప్రాంతవాసే అనే అభిప్రాయం అక్కడి స్థానికుల్లోనూ ఉంది. దాంతో అక్కడి నుంచే పోటీ చేయించాలని మరికొంతమంది అభిప్రాయం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధినేత చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ను పోటీ చేయించి గెలిపించి తీరాలనే కసితో ఉన్నామని పాలకొల్లు ప్రాంత నాయకులు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉండే వర్గం ఓటర్లు ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమనే భావనలో ఆ నాయకులు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!