HomeTelugu Reviews'సమ్మోహనం' మూవీ రివ్యూ

‘సమ్మోహనం’ మూవీ రివ్యూ

సినిమా : సమ్మోహనం
నటీనటులు : సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ, నరేష్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, హరితేజ
రచన, దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్‌
సంగీతం : వివేక్‌ సాగర్‌

కథా బలంతో ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా స్వచ్చమైన వినోదంతో సినిమాలు తీసే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ దర్శకుడి సినిమా అంటే ప్రతి సారి ఓ కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల అంచనా. ఈసారి అనూహ్యమైన ప్రేమకథ అంటూ సమ్మోహనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధీర్‌బాబు హీరోగా, అదితిరావు హైదరీ హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఇంద్రగంటి మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా? సుధీర్‌బాబు, అదితిరావుల సమ్మోహనం నిజంగా సమ్మోహన పరిచిందా తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం..

1 12

కథ : ఆర్. విజయకుమార్‌ (సుధీర్‌బాబు) ఓ చిత్రకారుడు. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. తన కళ పిల్లల ఊహాశక్తిని పెంచుతుందని నమ్ముతుంటాడు. సినిమాలంటే ఇష్టముండదు. కానీ అతడి తండ్రి సర్వేష్(సీనియర్ నటుడు నరేష్)కి సినిమాలంటే పిచ్చి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతలో ఓ చిత్రబృందం వాళ్లింటికి సినిమా షూటింగ్‌ కోసం వస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ సమీరా (అదితి రావు) తో విజయ్‌కి స్నేహం ఏర్పడుతుంది. సినిమాలోని తెలుగు డైలాగ్స్‌ను విజయ్‌ ద్వారా నేర్చుకుంటుంది. అలా వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. షూటింగ్ తర్వాత సమీరాను మర్చిపోలేక తనను కలిసేందుకు కులుమనాలీలో షూటింగ్‌ జరుగుతుంటే అక్కడికి వెళ్లి తన ప్రేమ విషయం చెబుతాడు. సినిమాలో స్టార్ హీరోయిన్‌ సమీర, సాధారణ యువకుడైన విజయ్‌ను ప్రేమిస్తుందా? సమీరం జీవితం వెనక ఎలాంటి కష్టాలున్నాయి అనే అంశాలతో మిగతా కథ నడుస్తుంది.

నటీనటులు : మధ్యతరగతి యువకుడిగా సుధీర్‌బాబు చాలా బాగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు నటన బాగుంది. ఆమె అందం, నటన చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. స్టార్ ఇమేజ్‌, ప్రేమ, వేధింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిలా అన్ని ఎమోషనల్స్‌లోనూ పండించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ పాత్ర కూడా బాగా పండింది. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్ర లోకేష్ హుందాగా కనిపించారు. హీరో సుధీర్, తల్లితో వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌గా రాహుల్‌ రామకృష్ణ, అభయ్ బాగానే చేశారు. హరితేజ, తనికెళ్ల భరణి, హర్షిణి, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు.

1a 2

విశ్లేషణ : ఓ స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయికకు ఓ సాధారణ యువకుడికి మధ్య సాగే ప్రేమ కథా చిత్రం ఈ సినిమా. సమ్మోహనం అనే టైటిల్‌తోనే ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి నిజంగానే కథా కథనాలతో ప్రేక్షకులను సమ్మోహన పరిచారు. ప్రేమ కథకు బలమైన ఎమోషన్స్‌, కామెడీ జోడించి మనసుకు హత్తుకునేలా చేశాడు. సినిమా హీరోయిన్లు కూడా మనుషులే.. వాళ్లు కూడా సామాన్య జీవితం గడిపేందుకు ఇష్టపడతారనే విధంగా.. సినీ ప్రపంచంపై బయట చెప్పుకునేంత చెత్తగా ఉండదని ఈ సినిమా ద్వారా ఓ సందేశాన్నిచ్చారు. సినిమాను కెరీర్‌గా మలుచుకున్నసగటు కథానాయిక జీవితం వెనక కష్టాలు ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రేమ కథ మొదలయ్యాక కథనంలో కాస్త వేగం తగ్గుతుంది. ప్రేమకథతో సాగే చిత్రం కాబట్టి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బలంగా పండించేందుకు ప్రేమ చిగురించే సన్నివేశాలను కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సుదీర్ఘమైన సంభాషణలు, అక్కడక్కడా కథని ముందుకు నడిపించేందుకు ప్రసంగాలు నత్తనడకన సాగినట్టనిపిస్తుంది. మధ్యలో నరేష్ కామెడీ బాగా నవ్విస్తుంది. సినిమా వాళ్లపై వేసిన పంచ్‌లు బాగా పేలాయి.

ప్రతిపాట కథలో భాగంగా వస్తూ అలరిస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. సినిమాకు డైలాగ్స్ మరో ప్లస్. పస్టాఫ్ అంతా హీరో ఇంట్లో షూటింగ్, అక్కడ హీరోయిన్‌తో ప్రేమలో పడే సన్నివేశాలతోనే సాగిపోతుంది. సెకండాఫ్‌లో కాస్త డ్రామా జోడించి హీరోయిన్‌ జీవితం వెనక కష్టాలు చూపిస్తారు. నటుల జీవితాల్ని సహజంగా కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. కథ చిన్నదే అయినా మంచి డైలాగ్స్‌తో, మంచి సీన్స్‌తో అందంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. చాలా సందర్భాల్లో డైలాగ్స్ మన జీవితాల నుంచి తీసుకున్నట్టుగా ఉంటుంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది. అక్కడక్కగా సాగదీత సన్నివేశాలు మినహా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి.

హైలైట్స్
హీరో, హీరోయిన్లు
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్, కామెడీ

డ్రాబ్యాక్స్
అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు

చివరిగా : సమ్మోహన పరిచిన సమ్మోహనం
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

సినిమా : సమ్మోహనం నటీనటులు : సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ, నరేష్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, హరితేజ రచన, దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్‌ సంగీతం : వివేక్‌ సాగర్‌ కథా బలంతో ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా స్వచ్చమైన వినోదంతో సినిమాలు తీసే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ దర్శకుడి సినిమా అంటే ప్రతి సారి ఓ...'సమ్మోహనం' మూవీ రివ్యూ