మహేశ్‌ కోసం ఓ గ్రామాన్ని సృష్టించేశారాట!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సగ భాగం చిత్రీకరణ అమెరికా, డెహ్రాడూన్‌లో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మిగిలిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఓ గ్రామంలో జరిగే సన్నివేశాలదే కీలక పాత్రట. ఇందుకోసం సుమారు 8 కోట్ల వరకు ఖర్చు చేసి ఓ గ్రామాన్నే సృష్టించేసినట్లు తెలుస్తుంది.

ఈ గ్రామంలో మహేశ్‌, అల్లరి నరేశ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రావు రమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌ తదితరులు సహాయ పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌, వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నారు.