నేను ప్రేమించే వ్యక్తి నటుడో, క్రికెటర్‌ కాదు: తాప్సీ

సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను తాజాగా ఓ విషయాన్ని అంగీకరించారు. తాను ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని తొలిసారి ఒప్పుకున్నారు. అయితే, తాను ప్రేమిస్తున్న వ్యక్తి నటుడో, క్రికెటరో కాదని తెలిపారు. సోదరి షగున్‌తో కలిసి తాప్సీ తాజాగా పింక్‌విల్లా వెబ్‌సైట్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నన్ను నిజంగా ఇష్టపడేవారు నా గురించి వచ్చే గాసిప్స్‌ను పెద్దగా పట్టించుకోరు. నా జీవితంలో ఉన్న వ్యక్తి.. అందరూ ఆసక్తిబరిచే రంగానికి చెందినవారు కాదు. అతను నటుడో, క్రికెటరో కాదు. పైగా అతను ఇక్కడికి సమీపంలో ఉన్నవాడు కూడా కాదు’ అని తెలిపారు.

ఈ విషయమై షగున్‌ మాట్లాడుతూ.. ఈ విషయంలో తాప్సీ తనకు కృతజ్ఞతలు తెలుపాలని, తనద్వారా ఆమెకు ఆ వ్యక్తి పరిచమయ్యాడని, ఇంతటి విచిత్రమైన వ్యక్తిని తాప్సీ ఎలా ఇష్టపడిందో అర్థం కావడం లేదని, ఇతను ఒకింత వికారమైన వ్యక్తి అంటూ సరదాగా పేర్కొంది. దీనికి తాప్సీ బదులిస్తూ.. ‘ నా రాకుమారుడిని కలిసేముందు నేను ఇంతకుముందు ఎన్నో కప్పలను ముద్దాడాను’ అంటూ చమత్కరించారు. ఇంట్లో పెళ్లి చర్చ వస్తూ ఉంటుందని, కానీ, దానిని దాటవేసే ప్రయత్నం చేస్తుంటామని తెలిపారు. పిల్లలను కనాలనుకున్నప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని, పెళ్లిద్వారానే పిల్లలను పొందాలని తాను భావిస్తున్నట్టు తాప్సీ చెప్పారు.