‘అక్షర’రివ్యూ‌

Review - Akshara - Good opportunity wasted
నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. ఈరోజు ఈ సినిమా విడుదలైంది. మెరుగైన చికిత్స పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచుకుంటూ ఉంటే, ఉన్నత విద్య పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు మధ్య తరగతి కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. చిత్రం ఏమంటే… ర్యాంకుల వేటలో ఆ కాలేజీలు చేసే అకృత్యాలను సైతం విద్యార్థుల తల్లిదండ్రులు మౌనంగా భరిస్తున్నారు. మన విద్యా వ్యవస్థలోని లోటు పాట్ల మీదే కాదు, చదువు కార్పొరేట్‌ సంస్థల పరమైన కారణంగా జరుగుతున్న నష్టం గురించి తెలిపే సినిమానే ‘అక్షర’.

క‌థ: అక్ష‌ర (నందిత శ్వేత‌) అనాధ. ఓ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా చేరుతుంది. విద్యార్థుల్లో భ‌యాల్ని పోగొడుతూ చ‌దువులు చెబుతుంటుంది. క్ర‌మంగా ఆ కాలేజీ డైరెక్ట‌ర్ శ్రీతేజ (శ్రీతేజ్‌)కీ, అక్ష‌ర‌కీ మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అక్ష‌ర‌ని ప్రేమిస్తున్న విష‌యం ఆమె ముందు బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నంలో ఉండ‌గానే శ్రీతేజ హ‌త్య‌కి గుర‌వుతాడు. శ్రీతేజ‌తోపాటు, ఏసీపీని కూడా తానే హ‌త్య చేశానంటూ అక్ష‌ర పోలీసుల‌కి లొంగిపోతుంది. మ‌రి ఆ ఇద్ద‌రినీ అక్ష‌ర‌నే హ‌త్య చేసిందా? చేస్తే అందుకు కార‌ణ‌మేమిటి? అనేది కథలోని అంశం.

విశ్లేషణ: నేటి విద్యా వ్య‌వ‌స్థ తీరునీ.. ర్యాంకుల కోసం కార్పొరేట్ సంస్థ‌లు విద్యార్థుల జీవితాలతో చెల‌గాట‌మాడుతున్న వైనాన్నీ స్పృశిస్తూ సాగే క‌థ ఇది. నిత్యం ప‌త్రిక‌ల్లోనూ, టీవీ ఛానెళ్లలోనూ చ‌ర్చ‌కొచ్చే అంశాలే ఇందులోని క‌థ‌. అయితే విద్యావ్య‌వ‌స్థ‌లోని మంచి చెడుల కంటే కూడా… ఓ యువ‌తి ప్ర‌తీకార క‌థే హైలైట్ అయ్యింది. విద్యాసంస్థ‌ల్ని న‌డుపుతున్న ఓ కార్పొరేట్ శ‌క్తి త‌న‌కి చేసిన అన్యాయానికి ఓ యువ‌తి ఎలా బ‌దులు తీర్చుకున్న‌ద‌నేది ఇందులో కీల‌కంగా క‌నిపిస్తుంది. విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సినిమా అనేది ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్న‌మే. సినిమాల్లో అక్క‌డ‌క్క‌డా ఒక‌ట్రెండు స‌న్నివేశాలు క‌నిపిస్తుంటాయి త‌ప్ప పూర్తి స్థాయిలో ఇదే అంశంతోనే వ‌చ్చిన సినిమాలు అరుదు. మ‌ధ్య‌లో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ప్ర‌సంగాల త‌ర‌హాలో కొన్ని విష‌యాల్ని చెప్పించారు.

పిల్ల‌లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, ర్యాంకుల కోసం విద్యాసంస్థ‌లు పాకులాడే విధానం ఎలా ఉందో ఆ ప్ర‌సంగాల్లో వినిపిస్తుంది త‌ప్ప‌… వాటిని క‌థ‌లో మిళితం చేసి చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ సినిమాలో అస‌లు క‌థ మొద‌ల‌వ్వ‌డానికే బోలెడంత స‌మ‌యం ప‌డుతుంది. ఫస్ట్‌ హఫ్ లో సినిమా దాదాపుగా కాల‌నీ ప్రెసిడెంట్ (అజ‌య్ ఘోష్‌), వాల్తేరు కింగ్స్ (మ‌ధునంద‌న్, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌) నేప‌థ్యంలోనే సాగుతుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా చ‌ప్ప‌గా… ఎలాంటి ఆస‌క్తి , వినోదం లేకుండా సాగుతాయి. శ్రీతేజ్ హ‌త్య నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ద్వితీయార్ధంలోనే ఫ్లాష్ బ్యాక్‌తోపాటు, చెప్పాల్సిన క‌థంతా ఉంటుంది.

నటీనటులు: అక్ష‌ర‌గా నందిత శ్వేత చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర ఆక‌ట్టుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థ‌ల అధిప‌తి సంజ‌య్ స్వ‌రూప్ కీల‌క పాత్ర‌ని పోషించారు. ఆయ‌న విల‌నిజం సినిమాకి హైలైట్ అయ్యింది. మ‌ధునంద‌న్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య తదిత‌రులు సినిమా ఆద్యంతం క‌నిపిస్తారు. కామెండి పెద్దగా పండలేదు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, అప్పాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ‌త్రు తదిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టైటిల్: అక్షర
న‌టీన‌టులు: నందిత శ్వేత, శకలక శంకర్‌, అజయ్‌ ఘోష్‌, మధునందన్, సత్య, హర్షవర్థన్‌ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: బి. చిన్నికృష్ణ
నిర్మాత‌: అల్లూరి సురేశ్‌ వర్మ, అహితేజ బెల్లంకొండ
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి

హైలైట్స్: నందిత శ్వేత నటన
డ్రాబ్యాక్స్: కథ, కథనం
చివరిగా: ఆకట్టుకోలేకపోయిన ‘అక్షర’.
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates