డ్రైవర్‌కు, హెల్పర్‌కు ఆలియా భారీ సాయం

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ తన మంచి మనసును చాటుకున్నారు. తన వద్ద ఎంతోకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్‌కు, హెల్పర్‌కు చెరో రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ నగదుతో వారు ముంబయి శివారులో రెండు చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నారట. ఇటీవల ఆలియా తన 26వ పుట్టినరోజు జరుపుకొన్నారు. బర్త్‌డేకి రెండు రోజులు ఉందనగా ఆలియా వారికి సాయం చేసి సర్‌ప్రైజ్‌ చేశారట. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ఆలియా. అప్పటినుంచి సునీల్‌, అన్మోల్‌ అనే ఇద్దరు యువకులు ఆలియా వద్ద డ్రైవర్‌గా, హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఆలియా వారిని ఇంట్లో మనుషుల్లాగే చూసుకుంటారు. అందుకే వారికంటూ సొంత ఇళ్లు ఉండాలని భావించిన ఆలియా రూ.50 లక్షల చెక్కును అందజేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. వీరికనే కాదు.. తన మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌, కుక్‌.. ఇలా తన వద్ద పనిచేసే వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆలియా అండగా నిలుస్తుంటారు. వర్క్‌ పరంగా ఆలియా ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆమె ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆలియా నటించబోయే తొలి తెలుగు చిత్రమిదే. ఆమె ‘కళంక్’, ‘సడక్‌ 2’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.