నా తమ్ముడైనా సహించను..మద్దతు తెలపను: ఫరా ఖాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై కూడా ‘మీటూ’ ఆరోపణలు వచ్చాయి. సలోని, రేచెల్‌, కరిష్మా అనే ముగ్గురు యువతులు సాజిద్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తమను లైంగికంగా వేధించారని అంటున్నారు. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన సాజిద్‌ ఓ యువతి పట్ల ఇంత నీచంగా ప్రవర్తించాడని తెలిసి ఆయనపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై సాజిద్‌ సోదరి, ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌ మీడియా ద్వారా స్పందించారు.

‘ఇది నా కుటుంబానికి ఎంతో క్లిష్టమైన సమయం. కఠిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ యువతి పట్ల నా తమ్ముడు ఇలా ప్రవర్తించాడంటే ఇందుకు అతను సమాధానం చెప్పి తీరాల్సిందే. తమ్ముడే అయినా నేను అతనికి మద్దతు తెలపను. సహించను. ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలకు నేను కచ్చితంగా సాయం చేస్తాను.’ అని వెల్లడించారు.

సాజిద్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కానీ, సాజిద్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అక్షయ్‌ సినిమా చిత్రీకరణను నిలిపివేశారు. కేసు విచారణ పూర్తయ్యేవరకు తాను నానా పటేకర్‌తో కానీ, సాజిద్‌తో కానీ కలిసి పనిచేయనని చెప్పారు. ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో తానే సినిమా నుంచి తప్పుకొంటున్నట్లు సాజిద్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నా కుటుంబంపై, ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాపై ఎంతో ఒత్తిడి ఉంది. ఇందుకు నేనే బాధ్యత వహించాలి. అందుకే దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాను’అని వెల్లడించారు సాజిద్‌.