కేసీఆర్‌పై అమిత్ షా మండిపాటు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శలకు దిగారు. తెలంగాణలో ఎన్నికల భేరి మోగించేందుకు శనివారం హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలను తప్పుబట్టారు. గత ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తామని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎంఐఎం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులుండవని అమిత్ షా స్పష్టం చేశారు.

తన కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని, కేసీఆర్ అవకాశవాద రాజకీయాలే ఇందుకు నిదర్శనం అని అమిత్‌ షా మండిపడ్డారు. బీజేపీ హయాంలో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఆయా రాష్ట్రాలన్నీ కలిసి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. కానీ ఏపీ, తెలంగాణలో పూర్తివిరుద్ధంగా జరుగుతోందన్నారు.