అధికారంలోకొస్తే మొదట ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం

సార్వత్రిక ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో ఉన్న రాహుల్‌.. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిశారు. స్థానిక లేబర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే మేం చేసే మొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం. గతేడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్యహామీని ప్రధాని మరిచారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోడీకి అర్థమయ్యేలా చెప్పాలి.’ అని అన్నారు.

దుబాయ్‌లోని భారత కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘దుబాయ్‌ అభివృద్ధిలో భారత కార్మికుల పాత్ర చాలా ఉంది. ఇక్కడి ఎత్తైన భవనాలు, పెద్ద మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, రోడ్లు మీ శ్రమ, చెమటతోనే నిర్మితమయ్యాయి. మీరు లేకుండా ఇదంతా ఇక్కడ సాధ్యమయ్యేది కాదు.భారత కార్మికుల వల్లే ఈ రోజు దుబాయ్‌ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక నగరంగా ఉంది. అంతేకాక పేదరికంలో ఉన్న మీ ఆప్తులకు అండగా ఉంటున్నారు. ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాహుల్‌ అన్నారు.