HomeTelugu Big Storiesమన జీవితంలో కరోనా అంతర్భాగం: జగన్‌

మన జీవితంలో కరోనా అంతర్భాగం: జగన్‌

6 26ఏపీ సీఎం జగన్‌ దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంథ్రప్రదేశ్‌ నిలిచిందని అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు.

”కరోనాకు సంబంధించిన విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. క్వారంటైన్‌లో ఉండేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మంచి ఆహారం అందిస్తున్నాం. పీపీఈలు, ఎన్‌95 మాస్కులు గతంలో ఏ ఆస్పత్రుల్లోనూ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లోనూ అవి సమృద్ధిగా ఉన్నాయి. ఈ నెల రోజుల్లో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి చోటా ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. అక్కడికి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి చేరుస్తున్నాం.

కరోనా చికిత్సకు సంబంధించిన ఆస్పత్రులకు ప్రత్యేకంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నాం. 14400 ప్రత్యేకంగా టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా కరోనా కేసులే కాకుండా మిగతా వ్యాధులకు కూడా చికిత్స అందించేలా చర్యలు చేపట్టాం. ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వడమే మాత్రమే అవసరమైన మందులను డోర్‌ డెలివరీ చేసేందుకు ఈనెల రోజుల్లేనే వ్యవస్థను తీసుకెళ్లగలిగాం. ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు సర్వే చేశాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాం. ఈ విషయంలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా” అని సీఎం చెప్పారు.

”కరోనాతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుడికి కొద్దొగొప్పో కష్టం కూడా ఏర్పడింది. రాష్ట్రానికీ ఎటువంటి ఆదాయాలు రాని పరిస్థితి ఉన్నప్పటికీ వీలైనంత వరకు సామాన్యుడికి ఎక్కడా నష్టం జరగకుండా అన్ని రకాలుగా ముందడుగులు వేసింది. ఇన్ని కష్టాలున్నా.. ఒక్కసారి ఇచ్చే రేషన్‌ సరకులును మూడుసార్లు ఇస్తున్నాం. ప్రతి పేద ఇంటికీ రూ.వెయ్యి సహాయం ఇవ్వగలిగాం. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు క్రమం తప్పకుండా ఇవ్వగలిగాం. ఈనెల రోజుల్లో ఇవన్నీ గొప్పగా చేయగలిగాం” అని వివరించారు.

”కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదు. ఇది వాస్తవంగా ఆలోచించాల్సిన అంశం. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుంది. కరోనా సోకితే అంటరానితనమనో.. ఒక భయంకరమైన రోగమనో అనే భావన అందరూ బుర్రల్లోంచి తీసేయాలి. రాబోయే రోజుల్లో సహజంగా అందరికీ వచ్చే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎప్పటికీ తీసేయలేం. మన జీవితంలో ఇది అంతర్భాగం అవుతుంది. స్వైన్‌ఫ్ల్లూ, చికెన్‌ఫాక్స్‌ తరహాలోనిదే ఇది కూడా. అయితే అవన్నీ నయమయ్యే వ్యాధులు. కరోనా సోకిన విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి వాళ్లు 80 శాతం మంది ఉన్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండానే వచ్చే అవకాశముంటుంది. ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 81 శాతం కేసులు ఇళ్లల్లో ఉండి నయమైనవి ఉన్నాయి. కరోనా సోకిందని చెప్పుకుంటే అంటరానివాడిననే భావన తీసేయాలి. రేప్పొద్దున నాకైనా రావొచ్చు. జ్వరంలాంటిదే. జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. పెద్దవాళ్లకు కాస్త దూరంగా ఉంటే చాలు. ఇది ఎవరికైనా రావొచ్చు. వివక్ష చూపాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంచెం కరోనా లక్షణాలు కనిపించినా తమంతట తామే వైద్యులకు సమాచారమిస్తే మందులిచ్చి వెళ్తారు. దీన్ని ఆవిధంగా భావించాలని అందరికీ వినయపూర్వకంగా కోరుతున్నా. మనంతట మనమే కట్టడి చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోగలిగితే అదే పరిష్కారం” అని జగన్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu