జైతో ప్రేమ గురించి అంజలి సంచలన వ్యాఖ్యలు‌..

సినీ నటులు అంజలి, జై ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట కలిసి ఉన్న ఫొటోలు ఇప్పటికే అనేకమార్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీరు ఒకరి పుట్టినరోజున మరొకరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా చెప్పుకున్నారు. భార్యాభర్తలు కలిసి చేసిన ‘దోస ఛాలెంజ్‌’ ను అంజలి, జై స్వీకరించి, వీడియోను షేర్‌ కూడా చేశారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారనే వదంతులు నిజమేనని అందరూ భావించారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై జై, అంజలి ఎప్పుడూ నోరువిప్పలేదు.

జైతో బంధం గురించి అంజలి చివరికి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన్ను ప్రేమించడం లేదని స్పష్టం చేశారు. ‘నేను జైతో డేటింగ్‌లో ఉన్నానని ఎప్పుడూ మీడియాతో చెప్పలేదు. వదంతులు వాటంతట అవే మొదలయ్యాయి. ఓ దశకు వచ్చాక అవి ఆగిపోయాయి. చిత్ర పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి వార్తలు చూసి ఏడ్చేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ అలాంటి వాటికి అలవాటు పడిపోయా’ అని అన్నారు.

అంజలి 2006లో ‘ఫొటో’ అనే తెలుగు సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేక తమిళ సినిమాల్లో నటించారు. 2011లో దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన ‘జర్నీ’ కోసం తొలిసారి జైతో కలిసి పనిచేశారు. ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. ఆమె తెలుగులో నేరుగా నటించిన చిత్రం ”సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)’. తర్వాత 2017లో వచ్చిన ‘బెలూన్‌’ సినిమాలోనూ జై, అంజలి జోడీగా కనిపించారు. అంజలి, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పేరంబు’ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా రాణిస్తోంది.