Homeతెలుగు Newsఏపీలో బంద్ ప్రశాంతం

ఏపీలో బంద్ ప్రశాంతం

11
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఉదయం నుంచే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని బంద్‌లో పాల్గొన్నారు. విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన ఈ బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. విజయవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు సీపీఐ నేతలు నిరసనకు దిగారు. రాజమహేంద్రవరంలో సీపీఐ, గుంటూరులో కాంగ్రెస్‌, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయాయి.

ఈ బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు సంఘీభావంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరుకానున్నారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ప్రైవేటు పాఠశాల, కళాశాల సంఘాలు కూడా బంద్‌కు సంఘీభావం తెలిపాయి. బంద్‌ సందర్భంగా జరిగే ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఏపీఎన్‌జీవో సంఘం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌కు బీజేపీ, వైసీపీ, జనసేన దూరంగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu