ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో మంత్రులు, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి ఎద్దడితో పాటు వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే తమ అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ధరల సవరింపు, బకాయిల చెల్లింపులపై అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని సూచించింది. ధరల పెంపునకు సంబంధించిన నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించొద్దని సూచించింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకే కేబినెట్‌ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశమైంది. విదేశీ పర్యటనల్లో ఉండటం, పలు వ్యక్తిగత కారణాల రీత్యా ఈ భేటీకి మంత్రులు పితాని సత్యనారాయణ, ఆదినారాయణ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.

CLICK HERE!! For the aha Latest Updates