టీఆర్ఎస్‌కు బీజేపీతో సంబంధం ఉంది : లోకేష్‌

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలంగాణ ఏర్పాడ్డాక తొలి ప్రభుత్వం గడువు తీరకముందే రద్దుకావడం బాధకల్గించిందని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఏం చెప్పుకుంటారు? అని ప్రశ్నించారు. ఫలానా పనిచేశామని టీఆర్ఎస్‌ చెప్పుకోదగిన అభివృద్ధి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. శుక్రవారం లోకేశ్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాల్లేవన్నారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి ఇస్తారని తాము అనుకున్నామని.. కానీ ఇవ్వలేదన్నారు. రైతు బంధు పథకం వల్ల కౌలు రైతులకు ఏ మాత్రం లబ్ధి చేకూరలేదన్నారు. ఏపీలో ఏడాదిలో నిర్మించిన ఇళ్లు కూడా నాలుగేళ్లలో తెలంగాణలో నిర్మించలేదని చెప్పారు. బీజేపీతో కలవనని కేసీఆర్‌ చెబుతున్నారని, కానీ బీజేపీ స్క్రిప్ట్‌ ప్రకారమే ఆయన నడుస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ‌, టీఆర్ఎస్‌ మధ్య అక్రమ సంబంధం ఉందన్నారు. బీజేపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఎంఐఎం తమ మిత్ర పక్షమని కేసీఆర్‌ అనడం విడ్డూరమన్నారు.

టీఆర్ఎస్‌ , బీజేపీల మధ్య పెళ్లి సంబంధమైతే గోత్రాలు కావాలి తప్ప అక్రమ సంబంధానికి గోత్రాలతో పనేంటి? అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలపై చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న లోకేశ్‌.. కేసీఆర్‌ అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎంలకే సమయం ఇవ్వని ప్రధాని కేటీఆర్‌కు మాత్రం ఇచ్చారని ధ్వజమెత్తారు. దక్షిణాదిలో బీజేపీకు కేసీఆర్‌ మినహా మరెవరూ దొరకలేదేమో అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ఏపీకి వ్యతిరేకంగా, కేంద్రానికి సానుకూలంగా టీఆర్‌ఎస్‌ సహకరించిందని విమర్శించారు. ప్రీపోల్‌ అలయన్స్‌ పెట్టుకున్న టీడీపీకు, ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మాత్రం కేంద్రం సహకరించిందని అన్నారు. జోనల్‌ వ్యవస్థకు మూడు రోజుల్లో గెజిట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేయాలన్న బిల్లు కేంద్రానికి పంపితే మోక్షమే లభించలేదన్నారు. అవినీతిపరుడు జగన్‌కు కేంద్రం సహకరిస్తోందని లోకేశ్‌ విమర్శించారు.