‘మీటూ’ లో కొంత మంది పేర్లు చూసి షాక్‌ అయ్యా: రెహమాన్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ ‘మీటూ’ సంఘటనలు తనను షాక్‌కు గురి చేశాయని అన్నారు. చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను అనేక మంది బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖుల పేర్లు బయటకువచ్చాయి. తాజాగా ఈ ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ రెహమాన్‌ ట్వీట్‌ చేశారు. తనకు తెలిసిన కొంత మంది పేర్లను ‘మీటూ’ ఉద్యమంలో వినడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు.

‘మీటూ’ ఉద్యమంలో కొంత మంది పేర్లు బయటికి రావడం నన్ను షాక్‌కు గురి చేసింది. బాధితులు, నిందితులు.. ఇద్దరికీ చెబుతున్నా. మన చిత్ర పరిశ్రమ క్లీన్‌గా, మహిళల్ని గౌరవించే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ధైర్యంగా తమ వేధింపుల గురించి చెప్పిన బాధితులకు దేవుడు మరింత శక్తినివ్వాలి. ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, విజయం అందుకోవడానికి వీలుగా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను, నా బృందం నిర్ణయించుకున్నాం. బాధితులు స్వేచ్ఛగా మాట్లాడే వీలును సోషల్‌ మీడియా కల్పిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇంటర్నెట్‌లో న్యాయం, అన్యాయం గురించి ప్రస్తావించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది’ అని రెహమాన్‌ పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌ను సంగీత దర్శకురాలు చిన్మయి శ్రీపాద రీట్వీట్‌ చేశారు. ధన్యవాదాలు చెబుతూ.. బాధతో కన్నీరు పెట్టుకుంటున్న ఎమోజీని షేర్‌ చేశారు.