‘అవతార్-2’ రివ్యూ


2009లో జేమ్స్ కామెరున్ దర్శకత్వం వహించిన ‘అవతార్’ సినిమాకి సీక్వెల్ గా ‘అవతార్ .. ది వే ఆఫ్ వాటర్’ రూపొందింది. సామ్ వర్థింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, మిచెల్లీ రోడ్రిగెజ్, జోయెల్ డేవిడ్ మూరే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జేమ్స్ కామెరున్ దర్శక, నిర్మాతగా వ్యవహరించాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో 50 వేలకి పైగా స్క్రీన్స్ పై ఈ సినిమా ఈ రోజున విడుదలైంది. జేమ్స్ హార్నర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందనేది చూద్దాం.

ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి కొంతమంది సైంటిస్టులు పండోరా అటవీ ప్రాంతాన్ని ప్రధానంగా కలిగిన ‘అవతార్’ లోకానికి జేక్స్ ను పంపిస్తారు. ‘అవతార్’ రూపు రేఖలను కలిగిన జేక్స్ .. అక్కడి ప్రజలకి చేరువై, అక్కడి యువతి ప్రేమలో పడతాడు. ఆ జంటకు ఇద్దరు మగపిల్లలు .. ఇద్దరు ఆడపిల్లలు కలుగుతారు. ఆ అటవీ ప్రాంతం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, వాళ్లంతా ఎంతో హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు. అరణ్య వాసుల ఎమోషన్స్ కి కనెక్ట్ అయిన జేక్స్, తన అధికారులు తనకి అప్పగించిన పనిని చేయడానికి నిరాకరిస్తాడు. జేక్స్ ధోరణి అధికారులకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆయన అంతు చూడటమే ప్రధానమైన ఉద్దేశంగా వారు క్వారిచ్ అనే ఆర్మీ అధికారిని రంగంలోకి దింపుతారు. ఆ తరువాత జేక్స్‌ ఎదురుకున్న సమస్యలు ఏమిటి.. ఆ అధికారుల నుండి గ్రహవాసులను, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నడు అనేదే కథ.

దర్శకుడిగా జేమ్స్ కామెరున్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కథా కథనాలతో ఆయన ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించాడు. ఆకాశవాసులు, అరణ్యవాసులు .. సముద్రవాసులు అంటూ, ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ ఆయన అందించిన విజువల్ ట్రీట్ ను చూసితీరవలసిందే. ఒక వైపున హీరో హీరోయిన్స్ .. మరో వైపున విలన్ .. ఇంకో వైపున రెండు తెగలకు చెందిన పిల్లలు. ఈ మూడు కోణాల్లోని పాత్రలను దర్శకుడు అద్భుతంగా మలిచి ఆవిష్కరించాడు. ఏ సీన్ కూడా అనవసరం అనిపించదు. పిల్లల పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వారి ట్రాక్ ను హైలైట్ చేసిన విధానం .. క్లైమాక్స్ వరకూ వారి భాగస్వామ్యాన్ని ఉంచిన పద్ధతి ఆకట్టుకుంటాయి. ‘ది వే ఆఫ్ వాటర్’ అన్నట్టుగానే సముద్రగర్భంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది.

ఒక వైపున అత్యంత ఆధునికమైన యుద్ధవిమానాలు, సబ్ మెరైన్లు, మరో వైపున అడవీ నేపథ్యంలో పక్షులను వాహనాలుగా చేసుకుని ‘అవతార్’ ప్రజలు చేసే యుద్ధ విన్యాసాలు, మరో వైపున సముద్ర గర్భంలోను జరిగే చేజింగ్స్, ఈ దృశ్యాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు పడేవరకూ ఊపిరి బిగబట్టి చూడవలసిందే. పట్టువదలకుండా .. పట్టు సడలకుండా దర్శకుడు చేసిన కసరత్తు, జేమ్స్ హార్నర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మారో ఫియోరో కెమెరా వర్క్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. బలమైన కథాకథనాలు, దానిని అద్భుతంగా ఆవిష్కరించే టెక్నాలజీ ఈ సినిమాకి ప్రాణంగా కనిపిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన విజువల్ ట్రీట్ ఈ సినిమా అని చెప్పచ్చు. తెలుగు వెర్షన్ కు అవసరాల శ్రీనివాస్ అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణ. ఇది ‘మన సినిమా’ అనిపించేలా మన భాషలోని చమత్కారాన్ని అవసరాల జోడించిన తీరును కొనియాడాల్సిందే. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు.

చివరిగా: అద్భుతమైన విజువల్ ట్రీట్ ‘అవతార్-2
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates