HomeTelugu Big Stories'అర్జున ఫల్గుణ' మూవీ రివ్యూ

‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ

Sree Vishnu Arjuna Phalguna Movie Review

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం’అర్జున ఫ‌ల్గుణ’‌. ‘జోహార్’ ఫేమ్ తేజ మర్ని తెర‌కెక్కించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. విభిన్నమైన స‌స్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా నేడు విడుదలైంది. ప్రచార చిత్రాలు, పాట‌లు ఆక‌ట్టుకునేలా ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? ఈ సినిమాతో శ్రీవిష్ణు మ‌రో విజ‌యాన్ని అందుకున్నారా తెలియాలంటే సినిమా చూద్దాం..

క‌థ: గోదావ‌రి జిల్లాలోని ముల్కల్లంక అనే ఊరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ ఊరిలో ఉండే ఐదుగురు స్నేహితులు అర్జున్ (శ్రీవిష్ణు), శ్రావ‌ణి (అమృతా అయ్యర్‌), రాంబాబు (రాజ్‌కుమార్), త‌డ్డోడు (రంగ‌స్థలం మ‌హేష్‌), అస్కర్ (చైత‌న్య గ‌రికిపాటి) డిగ్రీ చ‌దివి ఖాళీగా తిరుగుతుంటారు. ఊర్లోనే ఉండి సంపాదించుకుంటేనే బెట‌ర్ అనే ఉద్దేశంతో ఓ సోడా కంపెనీ పెట్టాల‌నుకుంటారు. అందుకోసం దాదాపు రూ.4 ల‌క్షలు పెట్టుబ‌డి కావాల‌నుకుంటారు. కానీ, అంత డ‌బ్బు వాళ్ల ద‌గ్గర ఉండ‌దు. మ‌రోవైపు త‌డ్డోడు కుటుంబాన్ని బ్యాంక్‌ అప్పుల‌ స‌మ‌స్య వేధిస్తుంటుంది. వారం రోజుల్లో తీసుకున్న అప్పు క‌ట్టకుంటే అత‌డి ఇల్లు జ‌ప్తు చేయాల్సి వ‌స్తుంద‌ని బ్యాంక్‌ అధికారులు హెచ్చరిక‌లు జారీ చేస్తారు. ఈ త‌రుణంలో త‌మ ఆర్థిక‌ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి అర్జున్ త‌న మిత్రుల‌తో క‌లిసి ఓ ప్రణాళిక ర‌చిస్తాడు. సుల‌భంగా డ‌బ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లింగ్ చేయ‌డానికి సిద్ధప‌డ‌తాడు. ఈ క్రమంలో అర్జున్ మిత్ర బృంద‌మంతా అనుకోని స‌మ‌స్యల్లో చిక్కుకుంటుంది. దీంతో ఒక్కసారిగా వాళ్ల జీవితాలు త‌ల‌కిందుల‌వుతాయి. ఓవైపు పోలీసులు వాళ్లను ప‌ట్టుకునేందుకు ప్రయ‌త్నిస్తుంటే.. మ‌రోవైపు ఓ రౌడీ గ్యాంగ్ వాళ్లకోసం వెతుకుతుంటుంది. రౌడీలకు అర్జున్ బృందానికి మ‌ధ్య ఏం జ‌రిగింది? ఈ స‌మస్యల నుంచి వాళ్లెలా బ‌య‌ట‌ప‌డ్డారు? త‌డ్డోడు బ్యాంకు అప్పుకు ఊరి క‌ర‌ణం (న‌రేష్‌)కు ఉన్న లింకేంటి? అర్జున్-శ్రావ‌ణి ప్రేమ‌క‌థ ఏమైంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాలి.

Arjuna phalguna movie revie

విశ్లేషణ: ఈ త‌ర‌హా సినిమాలు తెలుగులో చాలానే వ‌చ్చాయి. ఈ క‌థ‌కు గోదావ‌రి జిల్లాల స్థానికతను జోడించి కొత్తగా చెప్పే ప్రయ‌త్నం చేశారు ద‌ర్శకుడు తేజ మర్ని. ఆరంభంలో అర్జున్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుబంధాలు.. వాళ్లు చేసే అల్లర్లతో క‌థ‌ను సాఫీగా మొదలు పెట్టాడు. అప్పు తీర్చాలంటూ త‌డ్డోడు ఇంటిపైకి బ్యాంక్ అధికారులు రావ‌డం, వాళ్లకు అర్జున్ ఎదురు తిరిగి బుద్ధి చెప్పడం, ఆ త‌ర్వాత వాళ్ల అప్పు బాధ్యత‌ను అర్జున్ భుజానికెత్తుకోవ‌డంతో క‌థలో కాస్త వేగం పెరుగుతుంది. అయితే మ‌ధ్యలో సాగే క‌థ‌న‌మంతా నెమ్మదిగా ఉండ‌టం.. మిత్రుల మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న్ స‌న్నివేశాలు బ‌ల‌హీనంగా ఉండ‌టంతో సినిమా పేలవంగా న‌డుస్తున్న అనుభూతి సగటు ప్రేక్షకుడికి క‌లుగుతుంది. విరామానికి ముందు అర్జున్ బృందం గంజాయి స్మగ్లింగ్ కోసం అర‌కు వెళ్లడం.. స‌ర‌కుతో తిరిగొస్తుండ‌గా పోలీసుల‌కు ప‌ట్టుప‌డ‌టంతో క‌థ ర‌స‌వ‌త్తరంగా మారుతుంది.

సెకండాఫ్‌లో అర్జున్ బృందం పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డం.. ఈ క్రమంలో అనుకోకుండా ఒడిషాలోని ఓ రౌడీ గ్యాంగ్ చేతుల్లో ప‌డ‌టంతో క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. అయితే అక్కడి నుంచే క‌థ పూర్తిగా గాడి త‌ప్పుతుంది. అర్జున్ బృందం పోలీసుల నుంచి త‌ప్పించుకున్న విధానం మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది. అడ‌విలో వ‌చ్చే ఛేజింగ్ సీన్స్, మ‌ధ్య మ‌ధ్యలో రాంబాబు చేసే కామెడీ కాస్త కాల‌క్షేపాన్నిస్తాయి. అలాగే పోలీసుల‌కు రౌడీ గ్యాంగ్‌కు గొడ‌వ పెట్టి అర్జున్ జారుకునే ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాత నుంచి సినిమా మ‌రీ నెమ్మదించి పోతుంది. ముగింపునకు ముందు వ‌చ్చే ఎపిసోడ్స్‌లో ఏమాత్రం సంఘ‌ర్షణ క‌నిపించ‌దు. క్లైమాక్స్‌ అక్కడ‌క్కడా థ్రిల్ చేసినా చాలా వ‌ర‌కు ప్రేక్షకుల ఊహ‌ల‌కు త‌గ్గట్లుగానే సాగుతుంది.

Arjuna phalguna 1

నటీనటులు: శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయారు. శ్రావ‌ణి పాత్రలో అమృతా అయ్యర్ ఆక‌ట్టుకునేలా క‌నిపించింది. ప‌ల్లెటూరి అమ్మాయిగా ఆమె ఎంతో చ‌క్కగా క‌నిపించింది. అర్జున్‌తో ఆమె ల‌వ్‌ట్రాక్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. న‌ట‌న ప‌రంగా కొత్తగా చూపించ‌డానికి ఆమెకు అంత ఆస్కారం దొర‌క‌లేదు. విష్ణు స్నేహితుల్లో రాజ్‌కుమార్ పాత్రే ప్రేక్షకుల‌కు కాల‌క్షేపాన్నిస్తుంది. పోలీసుల‌కు దొరికిన సంద‌ర్భంలో అత‌డు చేసే కామెడీ న‌వ్వులు పూయించింది. పోలీస్ అధికారిగా సుబ్బరాజు, క‌ర‌ణంగా న‌రేష్ పాత్రలు ప‌రిధి మేర ఆక‌ట్టుకుంటాయి. సినిమాలో గోదావ‌రి అందాల‌ను చ‌క్కగా చూపించిన ద‌ర్శకుడు తేజ.. క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దుకోవ‌డంలో విఫ‌ల‌మయ్యాడు. ప్రియ‌ద‌ర్శన్ బాల‌సుబ్రహ్మణ్యన్ సంగీతం, జ‌గదీష్ చీక‌టి ఛాయాగ్రహ‌ణం సినిమాకి బ‌లాన్నిచ్చాయి.

టైటిల్‌ : అర్జున ఫల్గుణ
నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌, నరేశ్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్‌, మహేష్‌
దర్శకత్వం: : తేజ మార్ని
నిర్మాణ సంస్థ: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

సంగీతం : ప్రియ‌ద‌ర్శ‌న్

హైలైట్స్‌‌: శ్రీవిష్ణు నటన
డ్రాబ్యాక్స్‌: క‌థ‌

చివరిగా: పెద్దగా ఆకట్టుకోని ‘అర్జున ఫల్గుణ’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu