‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో బాహుబలి టీమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌ 6లో పాల్గొన్న బాహుబలి త్రయం(ప్రభాస్‌, రానా, రాజమౌళిలు) పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి టెలికాస్ట్‌ అయిన కాఫీ విత్‌ కరణ్‌ ఎపిసోడ్‌ చాలా సరదాగా సాగింది. ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో కరణ్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను బాహుబలి టీమ్‌ ముందు ఉంచారు.

కరణ్‌.. మీ ముగ్గురినీ ఈ షోకి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ప్రభాస్‌..నువ్వు అసలు ఇలాంటి టీవీ షోలలో పాల్గొనవట. నిజమేనా?
ప్రభాస్‌.. అవును. ఎందుకంటే..ఇలా కాకుండా మీరు నన్ను సినిమాల్లో చూస్తేనే బాగుంటుంది.
ఇలాగైతే నువ్వు ‘డార్లింగ్‌’ ఎలా అయ్యావ్‌ ప్రభాస్‌..?
ఎందుకంటే నేను తక్కువగా మాట్లాడతాను కాబట్టి..(నవ్వుతూ)
‘బాహుబలి’ సినిమా కోసం మీ ముగ్గురూ దాదాపు నాలుగున్నరేళ్లు వేరే పని పెట్టుకోకుండా నిరంతరం శ్రమించారు. ఆ అనుభూతి ఎలా అనిపించింది?
ప్రభాస్‌: ముగ్గురం కలిసి ఓ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలనుకున్నాం కాబట్టి ఏం జరిగినా అందరం కలిసే ఉండాలని అనుకున్నాం. ఉన్నాం. ఈ సినిమా అంతర్జాతీయంగానూ ప్రేక్షకులకు నచ్చింది. కాబట్టి ఆ నాలుగున్నరేళ్ల కష్టం తెలీడంలేదు.
రానా: నేను మధ్యలో కొన్నిఓ చిత్రాల్లో నటించాను కూడా. ‘బాహుబలి’తో నాకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మనం యశ్‌రాజ్‌ థియేటర్‌లో ఈ సినిమాను చూశాం. సినిమా చూశాక హాలంతా ప్రేక్షకుల చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ తర్వాత టాక్‌ ఎలా ఉందోనని హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లాం. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఊహించిన స్పందన లేకపోవడంతో ‘వీళ్లు చూస్తున్నది ‘బాహుబలి’ సినిమానేనా?’ అన్న సందేహం కలిగింది (నవ్వుతూ).
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో అగ్ర కథానాయకులు ఉన్నారు. వారంతా మీకు స్నేహితులేనా?
రాజమౌళి: రామ్‌ చరణ్‌, రానా‌, బన్నీ చిత్ర పరిశ్రమలోనే పెద్ద రౌడీలు.
ప్రభాస్‌, రానాలో ఎవరు బ్యాడ్‌ బాయ్‌?
రాజమౌళి: ప్రభాస్ అయితే కాదు(నవ్వుతూ)
రానా, ప్రభాస్‌..మీ ఇద్దరూ సింగిలేనా?
రానా: నేను సింగిల్‌..
ప్రభాస్‌: నేను కూడా సింగిల్‌.
ప్రభాస్..నువ్వు సింగిలా? మరి నువ్వు అనుష్క శెట్టితో డేటింగ్‌లో ఉన్నావని వార్తలు వస్తున్నాయి కదా..
ప్రభాస్‌: ఏ నటితోనైనా రెండేళ్లు కలిసి పనిచేస్తే వారి మధ్య ఇలాంటి లింక్స్‌ పెట్టేస్తారు. కావాలంటే రాజమౌళిని అడగండి. (మధ్యలో రాజమౌళి, రానా అందుకుని.. ‘అవును ప్రభాస్‌ చెప్పేది నిజమే’) అన్నారు.
మీరు ఎప్పుడు పెళ్లిచేసుకుంటారు రానా? చాలా మంది అడుగుతున్నారు కదా..
రానా: జీవితంలో అందుకు తగిన సమయం రావాలన్నది నా అభిప్రాయం. నా స్నేహితులైన తారక్‌, బన్నీ పెళ్లి చేసుకున్నప్పుడు..’బాబోయ్‌ ఇక నేను వీళ్లతో ఎలా ఫ్రెండ్‌షిప్‌ చేయగలను’ అనిపించింది (నవ్వుతూ).
మరి నువ్వు త్రిషాతో డేటింగ్‌లో ఉన్నావని అంటున్నారు కదా..? మరి ఆమెను ఎందుకు పెళ్లిచేసుకోలేదు?
రానా: త్రిష, నేను ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. తక్కువ రోజులే డేటింగ్‌ చేశాం. వర్కవుట్‌ కాలేదు.
రాజమౌళి సర్‌.. మీకు నచ్చకపోయినా ఫలానా సినిమా బాగుంది అని ట్వీట్‌ చేసిన సందర్భాలున్నాయా?
రాజమౌళి: ఉన్నాయి.
ఏదన్నా సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు విసుగు పుట్టి వేరే హీరోతో సినిమా చేయాలనిపించిందా?
రాజమౌళి: లేదు.
మీకు మీ భార్యంటే భయమా?
రాజమౌళి: కొన్ని విషయాల్లో. కానీ అది గౌరవంతో కూడుకున్న భయం.
ప్రభాస్‌..ఇప్పుడు మీరు నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు అబద్ధపు సమాధానాలు ఇచ్చారు కదూ..?
ప్రభాస్‌: అవును.
ఏ విషయంలో అబద్ధం చెప్పారు?
ప్రభాస్‌: మర్చిపోయా. (మధ్యలో రాజమౌళి అందుకుని.. నేను చెప్పాగా ప్రభాస్‌కి బాగా బద్ధకం అని. ఏ అబద్ధం చెప్పాడో కూడా గుర్తులేనంత బద్ధకం తనకు)
ప్రభాస్‌..మీకు నచ్చిన సహనటి ఎవరు?
ప్రభాస్‌: అనుష్క. కానీ మా గురించి వస్తున్న రూమర్లకు నేను చెప్పిన సమాధానానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నాకు అనుష్క ఎనిమిదేళ్ల నుంచి తెలుసు. మంచి అమ్మాయి.
రాజమౌళి సర్‌..దేవసేనగా అనుష్కను కాకుండా ఇంకెవర్ని తీసుకుంటారు?
రాజమౌళి: దీపిక పదుకొణె.