అర్జున్ రెడ్డి రీమేక్ దర్శకుడు ఇతడే!

ఇటీవల టాలీవుడ్ లో విడుదలయ్యి ఘన విజయం సొంతం చేసుకున్న చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతో దర్శకుడు సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ వంటి వారికి మంచి గుర్తింపు లభించింది. అప్పటికే పెళ్ళిచూపులు సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో టాప్ యంగ్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు దృవ్ ను ఈ రీమేక్ తో హీరోగా పరిచయం చేయాలని ప్రముఖ నిర్మాత ముఖేష్ మెహతా ముందుకొచ్చారు. 
అయితే తాజాగా ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేయనున్నారనే విషయంలో.. నేషనల్ అవార్డ్ డైరెక్టర్ బాల పేరు వినిపిస్తోంది. తమిళనాట అగ్ర దర్శకుల్లో ఒకరైన బాల ఈ రీమేక్ డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. గతంలో బాల.. విక్రమ్ హీరోగా ‘సేతు’,’పితామగన్’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విక్రమ్ తనయుడు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి బాల చేరడంతో తమిళనాట ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.