భారీ ధరకు ‘భరత్ అను నేను’ ఓవర్సీస్ రైట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మహేష్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. గతంలో మహేష్-కొరటాల కాంబినేషన్ లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా ఘన విజయాన్ని అందుకున్న నేపధ్యంలో ‘భరత్ అను నేను’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 18 కోట్ల 18 లక్షలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించిన హక్కులే ఈ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ లో ఒక్క ప్రీమియర్ షోలతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తున్నాయి. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ లో పెట్టిన పెట్టుబడి కాకుండా.. భారీ మొత్తంలో లాభాలను అందుకుంటున్నారు. హీరోలు ఓవర్సీస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ను జోడించమని దర్శకనిర్మాతలకు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ లో ఈ రేంజ్ లో బిజినెస్ చేసిన చిత్రాల్లో ‘భరత్ అను నేను’ ఒకటిగా నిలవడం విశేషం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.