బిగ్‌బాస్‌ను సైతం భయపెడుతున్న కౌశల్ ఆర్మీ?

తెలుగు బిగ్‌బాస్-2 లోకి ఓ సాధారణ ఆర్టిస్టుగా అడుగుపెట్టాడు కౌశల్. అయితే అనూహ్యంగా ఇప్పుడు కౌశల్ ఆర్మీ సహాయంతో ప్రభంజనంలా తయారయ్యాడు. కౌశల్ ఆర్మీ నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన 2కే వాక్ ప్రభంజనం సృష్టించడంతో అందరూ షాక్ అవుతున్నారు . కౌశల్ కు వస్తున్న పాపులారిటీని చూసి బిగ్‌బాస్ చరిత్రలోనే ఇటువంటి సంఘటన జరగలేదని బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోతున్నారట. ఒకవైపు తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు లేవు కానీ అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది, రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కోలాహలం నెలకొని ఉన్నప్పటికీ కౌశల్ ఆర్మీ సైతం అదేస్థాయిలో ప్రభావం చూపిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ ఎవరీ కౌశల్ ఆర్మీ అంటూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది . కౌశల్‌ని ఎవరైనా ఎదిరిస్తే, లేదా టార్గెట్ చేసినట్లు మాట్లాడినా చాలు కౌశల్ ఆర్మీ వాళ్ళని ఎలిమినేట్ అయ్యేలా ఓట్ల రూపంలో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోంది. కౌశల్ ఆర్మీ పద్దతి చూస్తుంటే బిగ్ బాస్-2 విజేత కౌశల్ అని చెప్పకనే చెబుతున్నారు . ఒకవేళ కౌశల్ కు కాకుండా మరొకరిని విజేతగా ఎంపిక చేస్తే సహించేలా లేరు. అంతటి తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు కౌశల్ ఆర్మీ . బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని సైతం ప్రభావితం చేసేలా ఆర్మీ ప్లాన్స్ ఉంటున్నాయంటే ఏ స్థాయిలో కౌశల్ ఆర్మీ పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు . సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ సంచలనం సృష్టిస్తోంది. దాంతో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అని తేల్చి చెబుతున్నారు.