ఆ రీమేక్ అటకెక్కినట్లే!

బాలీవుడ్ లో వచ్చిన ‘క్వీన్’ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో సౌత్ లో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ ఈ సినిమా రీమేక్ హక్కులు సంపాదించుకున్నాడు. దక్షిణాది నాలుగు బాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా నాలుగు బాషల్లో నటీనటులను, దర్శకులను ఫైనల్ చేసుకున్నారు. తెలుగు, తమిళ వెర్షన్స్ కోసం తమన్నాను, మలయాళానికి అమలాపాల్ ను, కన్నడలో హీరోయిన్ గా పారుల్ యాదవ్ ను ఎంపిక చేసుకున్నారు. దర్శకులను కూడా ప్రకటించేశారు. కానీ ఇప్పుడు ఏమైందో.. గానీ సడెన్ గా ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఎంతసేపటికీ ఈ రీమేక్ సంగతి తేల్చకపోవడంతో తమన్నా వేరే కమిట్మెంట్స్ తో బిజీ అయిపోయింది. తెలుగు, తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాల్సిన రేవతి కూడా ఈ ప్రాజెక్ట్ ను వదిలేసిందని టాక్. దీంతో ఇక ఈ సినిమా అటకెక్కినట్లే అంటున్నారు. నిజానికి క్వీన్ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. విడుదలైన కొత్తలో సినిమా క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అప్పుడే రీమేక్ కూడా చేసేసి ఉంటే ఆ క్రేజ్ కాస్తయినా.. హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు హైప్ మొత్తం పోయి.. ఇంకా లేట్ చేయడం చూస్తుంటే ఇప్పట్లో ఇది వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.