బాలీవుడ్‌ నటుడు ఖాదర్‌ ఖాన్‌కు అస్వస్థత

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఖాదర్‌ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కెనడాలో ఉన్న ఖాదర్‌ ఖాన్‌ గురువారం రాత్రి ఊపిరాడటంలేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను ప్రత్యేక వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని, కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ రావడంలేదట. కొంతకాలం క్రితం ఖాదర్‌ ఖాన్‌ మోకాలికి శస్త్రచికిత్స జరిగిందని ఆయన కుమారుడు సర్ఫరాజ్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాన్నకు చేసిన శస్త్రచికిత్స వికటించలేదు. ఆయన్ను వైద్యులు అప్పుడప్పుడూ నడుస్తూ ఉండాలని చెప్పారు. కానీ ఓపిక లేదంటూ ఆయన లేచే వారే కాదు’ అని తెలిపారు. హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించారు ఖాదర్‌. ‘ముఝ్‌సే షాదీ కరోగీ’, ‘లక్కీ’, ‘జోరూ కా గులాం’, ‘అనారీ నెం.1’, ‘జుడ్వా’, ‘జుదాయి’ తదితర బ్లాక్‌బస్టర్‌ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఖాదర్.