బన్నీ బర్త్ డే స్పెషల్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరిచయం అక్కర్లేని పేరు.. ఇండస్ట్రీకు సంబంధించిన పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులతో ముద్దుగా బన్నీ అని పిలిపించుకుంటున్నాడు. ఇక ఆయన ప్రతిభ తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా కన్నడ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. అక్కడి వారంతా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. నిజానికి బన్నీను సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన వారింట్లో వారికి లేదట. బన్నీకి ముందు నుండి కూడా బొమ్మలు గీయడం అంటే ఇష్టమట.
 
ఆ దిశగా ప్రోత్సహించగా యానిమేషన్ రంగంలో పట్టు సాధించడానికి ఫారెన్ వెళ్లాలని అనుకున్నాడు. అయితే చిన్నప్పటినుండి సినిమా వాతావరణంలో పెరగడంతో ఆ ప్రభావం తనపై ఉండేది. ఓసారి సినిమా సెలెక్షన్స్ కోసం వెళితే అక్కడ బన్నీను ఎన్నుకోలేదు. దీంతో అతడికి సినిమాపై కసి పెరిగి నటనలో శిక్షణ పొందాడు. అంతేకాదు అతడికి మొదటి నుండి జిమ్నాస్టిక్స్ చేయడం అలవాటు. దీంతో డాన్స్ చేయడం కూడా బాగా నేర్చుకున్నాడు. ఇప్పటికీ కూడా ఏ కొరియోగ్రాఫర్ ఎలాంటి స్టెప్ ఇచ్చినా.. నో చెప్పకుండా ఎంత కష్టంగా ఉన్నా డాన్స్ చేసే తత్వం బన్నీది.
 
డాన్స్ చేసేప్పుడు కొన్నిసార్లు దెబ్బలు తగిలిన సంధార్భాలు లేకపోలేదు. గంగోత్రి నుండి త్వరలోనే విడుదల కాబోతున్న దువ్వాడ జగన్నాథం వరకు ఆయన సాగించిన ప్రయాణం కోట్ల మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది. ఈరోజు బన్నీ పుట్టినరోజు సంధర్భంగా అభిమానులు  హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో పుట్టినరోజు వేడుకలను జరపనున్నారు. ఇంతమంది ఆదరణ పొందిన బన్నీ ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం!