Homeతెలుగు Newsకేంద్రం బెదిరింపులకు భయపడేది లేదు : చంద్రబాబు

కేంద్రం బెదిరింపులకు భయపడేది లేదు : చంద్రబాబు

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. పునరుద్ధరణ కార్యక్రమాల్లో 15 మంది మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పంట నష్ట పరిహారాన్ని అందజేస్తామని, ఉద్దానం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. తుపాను బాధితుల కోసం సేకరించిన విరాళాలతో చేసిన పనులకు దాతల పేర్లు పెడతామని సీఎం వివరించారు.

1 16

తిత్లీ తుపాను ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకు బీచ్‌ రోడ్డును అభివృద్ధి చేసి జాతీయ రహదారికి అనుసంధానిస్తామన్నారు. బీచ్‌ రోడ్డును అభివృద్ధి చేస్తే శ్రీకాకుళం జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తుపాను బాధితుల సహాయార్థం టెక్కలికి చెందిన ఐతం కళాశాల యాజమాన్యం రూ.3లక్షల విరాళాన్ని సీఎంకు అందజేసింది. మరోవైపు పలాసలోనూ సీఎం పర్యటించారు. రైల్వే మైదానంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్రం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేంద్ర హోం మంత్రి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా పార్టీ సమావేశాలకే పరిమితమయ్యారని.. వైసీపీ నేతలకు మానవత్వం లేదని విమర్శించారు. పక్క జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ప్రజల సమస్యలు తెలియవా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!