AP Politics : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత లోటు బడ్జెట్‌తో ఏపీ ఏర్పడింది. కేంద్రం విభజన అయితే చేసింది గానీ విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఏపీ తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. లోటు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని ఏపీ ప్రజలు చంద్రబాబును గెలిపించి సీఎంను చేశారు.
అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తమ వంతు ప్రయత్నం చేశారు చంద్రబాబు. మరో ఐదేళ్లు పాలనలో ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అంటున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేసిందని ఆరోపిస్తున్నారు. ఏపీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కూడా కేంద్రం ఇవ్వకపోవడం వలన ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కొంతవరకు చేజారింది. మరోవైపు సంపదను సృష్టించడం చేతకాక, అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చిందని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి గెలిచి చంద్రబాబు సీఎం అయితే పదేళ్ల క్రితం ఉన్న సమస్యల కంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. రాష్ట్రానికి రాజధాని లేదు. ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయింది. ఉన్న రాజధానిని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అంటూ అసలు ఒక్క రాజధాని కూడా లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతో అమరావతిలో నిర్మించిన నిర్మాణాలు చాలావరకు దెబ్బతిన్నాయి.
ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా మళ్ళీ నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మొదటి నుంచీ పనులు మొదలు పెట్టాల్సిరావచ్చు. ఏపీలో విద్యుత్ ఛార్జీల భారంతో పరిశ్రమలు, ముఖ్యంగా ఆక్వా, గ్రానైట్, సిమెంట్ తదితర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే సామాన్య ప్రజలు కూడా విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరల భారంతో సతమతమవుతున్నారు. కనుక ఈ సమస్యను చంద్రబాబు నాయుడు పరిష్కరించాల్సి ఉంటుంది.
జగన్ ప్రభుత్వం కనీసం వ్యవసాయ రంగాన్ని కూడా పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటల దిగుబడి, దానితో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు, అటు పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏపీకి రావడం మానుకున్నాయి.
వైసీపి నేతల వేధింపులకు భయపడి ఉన్న పరిశ్రమలు కూడాఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. దీంతో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం మళ్ళీ పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పట్ల నమ్మకం కల్పించడమే చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాలు. ఇప్పుడు చంద్రబాబును నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెడితే రేపు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏమిటి? అని పెట్టుబడిదారుల ప్రశ్నిస్తే చంద్రబాబు సంతృప్తికరమైన జవాబు చెప్పాల్సి ఉంటుంది.
అప్పుడే వారు ఏపీలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు స్థాపించడానికి ముందుకు వస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పక్కన పడేస్తామని జగన్ ప్రభుత్వం ఇప్పటికే నిరూపించింది. ఐదేళ్ళుగా చంద్రబాబు సహా టీడీపీలోని ముఖ్యనేతలందరినీ జగన్ ప్రభుత్వం ఎంతగానో వేధించింది. కనుక టిడిపి నేతలందరూ జగన్, వైసీపి నేతలపై పగతో రగిలిపోతున్నారు.
అలాగని వారిపై వెంటనే చర్యలు తీసుకోవడం మొదలుపెడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక చంద్రబాబు చాలా ఆలోచించి వైసీపికి ముక్కుతాడు వేయవలసి ఉంటుంది. ఇక టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయాల్సి ఉంటుంది. వాటి కోసం నిధులు సమకూర్చుకోవాలి… లేకుంటే చంద్రబాబు విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కొత్తగా అప్పులు తెచ్చేందుకు కూడా అవకాశం లేకుండా ఈ ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వం అందినకాడికి అప్పులు చేసేసి అన్ని దారులూ మూసేసింది.
జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీల భారం కూడా చంద్రబాబు ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు, ఇతర పదవులు పంపకాల సమస్యలు చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. మూడు పార్టీల ఉమ్మడి విధానాల ప్రకారం పాలన వంటి కొన్ని బాలారిష్టాలు ఎలాగూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, చంద్రబాబు సీఎం అయితే పాలన మళ్లీ పదేళ్ల వెనక నుంచి మొదలు పెట్టినట్టే అవుతుంది.