ఢిల్లీ: పీఎంవో అధికారులతో జగన్‌ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)కు వెళ్లారు. అక్కడ కార్యాలయ కార్యదర్శులతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై వారితో చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయమే అజెండాగా సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు. తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ.. ఆర్టికల్‌ 370 రద్దుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో జగన్‌ తొలుత 10 జనపథ్‌లోని తన నివాసానికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాని కార్యాలయానికి చేరుకొని పీఎంవో కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, అదనపు కార్యదర్శి పీకే శర్మతో భేటీ అయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, విభజన అంశాలు, ప్రత్యేకంగా ఏపీకి ఆర్థిక సాయంపై వారితో చర్చించినట్టు సమాచారం. ప్రధానితో భేటీలో నివేదించాల్సిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలవరం కాంట్రాక్టుల రద్దు, పీపీఏల రద్దుతో పాటు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనే అంశంపైనా అధికారులతో చర్చించినట్టు సమాచారం. సాయంత్రం 5గంటలకు సీఎం జగన్‌ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సహకారం.. విభజన సమస్యల పరిష్కారంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనూ మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పీఎంవో కార్యాలయానికి వెళ్లిన జగన్‌ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌, పలువురు సీఎంవో అధికారులు ఉన్నారు.