మళ్లీ తెరపైకి కిరణ్‌ కుమార్‌ రెడ్డి


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. ఆఖరి అస్త్రం ఉందంటూ సమైక్యాంధ్ర కోసం చివరి నిమిషం వరకూ పోరాడిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజన జరిగి పోవడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. దాంతో దాదాపు నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన యాక్షన్ ప్లాన్‌ ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా కిరణ్‌కుమార్‌ రెడ్డి అంతరంగం అంతుబట్టక పీలేరు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు, అభిమానులు దిక్కులు చూడాల్సి వస్తోంది. తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో ఆయన కోసం వేచి చూడాలో లేక తమను ఆహ్వానిస్తున్న పార్టీల్లో చేరాలో అర్ధం కాక వారు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏళ్ల తరబడి నల్లారి సోదరుల మౌనంతో వారి సొంత నియోజకవర్గం పీలేరులో వైసీపీ, టీడీపీ నాయకుల జోరు పెరిగింది. నల్లారి అనుచరులు ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ తర్వాత కొందరు అధికార, విపక్ష పార్టీల తీర్థం పుచ్చుకోవడంతో నల్లారి కేడర్ చెదిరిపోతూ వచ్చింది. ఈ పరిస్థితి గుర్తించిన కిరణ్ సోదరుడు కిషోర్‌ కుమార్‌ రెడ్డి తనకుటుంబ కేడర్‌ను కాపాడుకునేందుకు అనుచరులు, అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఏడాది క్రితం టీడీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పెద్దల ఆహ్వానంతో కిరణ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరడంతో నల్లారి కుటుంబం రాజకీయంగా చిన్నబోయినట్టయింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కిరణ్ రెండుసార్లు పీలేరు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే అక్కడ నగరిపల్లిలోని స్వగృహానికి వెళ్లకుండా కలికిరిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బసచేసి అనుచరులు, అభిమానులతో గడిపారు. త్వరలోనే వివిధ మండలాల్లో పర్యటించి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకు రావడమే లక్ష్యమని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలి విడుదలై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించినా తమ నేతమాత్రం గుంభనంగా ఉండటం వారిని అయోమయానికి గురి చేస్తోంది. కనీసం ఫోన్‌లోకి కూడా అందుబాటులోకి రాకపోవడంతో తమ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటో అంతుబట్టక నల్లారి అనుచరులు డోలాయమానంలో పడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం, టీడీపీతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం నచ్చకనే కిరణ్‌ మౌనం పాటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.