జగన్‌ గెలిస్తే కాల్వల్లో నీరు పారదు.. కన్నీరే పారుతుంది: చంద్రబాబు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ ప్రాజెక్టులను కేసీఆర్‌ నియంత్రణలోకి తీసుకుంటారని అన్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూసేయాలని కేసీఆర్‌ కోరుతున్నారని.. అలా జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుందని చెప్పారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ సంపదను ప్రజలకు పంచుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రతి సంవత్సరం డ్వాక్రా మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తానని సీఎం ప్రకటించారు. కష్టపడి సంపద సృష్టిస్తానని.. అది మీకే ఇస్తానని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. మోడీని చూస్తే జగన్‌కు భయమని.. అందుకే ఏపీ ప్రజల్ని తాకట్టు పెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదు.. అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అధికారంలోకి వస్తే కాల్వల్లో నీరు పారదని.. కన్నీరే పారుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.