Homeతెలుగు Newsజగన్‌ పెద్దరౌడీ అయితే.. చెవిరెడ్డి చిన్నరౌడీ: చంద్రబాబు

జగన్‌ పెద్దరౌడీ అయితే.. చెవిరెడ్డి చిన్నరౌడీ: చంద్రబాబు

5 1టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. తన పాలనలో దళారీ వ్యవస్థ.. అవినీతి లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. చంద్రగిరి వచ్చాక తనకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయన్నారు. ఇక్కడే నివాసం ఉండి చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. 1978లో చంద్రగిరిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశానని చెప్పారు. ఆ తర్వాత కుప్పం వెళ్లానని.. ఇప్పుడు అక్కడి నుంచి ఏడోసారి పోటీచేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. చంద్రగిరిలో ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత తనదని చెప్పారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పెద్దరౌడీ అయితే.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిన్నరౌడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి చిన్నచిన్న రౌడీలను ఎంతోమందిని చూశానన్నారు. చెవిరెడ్డిలాంటి వారిని ఓడించి ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. టీడీపీ అభిమానులపై ఆయన అనుచరులు దాడులకు దిగడం దారుణమన్నారు. పులివెందులలో రౌడీయిజం ఎక్కువని.. అక్కడ జగన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు. పులివెందులలో జగన్‌ గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పారు. అక్కడ జగన్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని.. పండ్ల తోటలపై 20 శాతం పన్ను వసూలుతో రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని సీఎం ఆరోపించారు.

మహిళలకు అండగా ఉండే ఏకైక పార్టీ టీడీపీ.. గత ప్రభుత్వాలు ఏనాడైనా మహిళల కోసం ఆలోచించాయా అని ప్రశ్నించారు. త్వరలోనే పసుపు-కుంకుమ నగదు బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలకు తానిచ్చిన చెక్కులు చెల్లుతాయని, వైసీపీ నేతలే చెల్లని కాసులని సీఎం వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్లలో మరో మూడుసార్లు ‘పసుపు-కుంకుమ’ ఇస్తామన్నారు. చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.10లక్షలకు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇచ్చే సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఊహకందని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. పోలవరం 70 శాతం పూర్తి చేశామని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేసి జులై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామన్నారు.

నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిరుద్యోగభృతిని ఇప్పటి వరకు డిగ్రీ ఉత్తర్ణులైనవారికి ఇచ్చామని.. భవిష్యత్తులో ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా తయారుచేస్తామన్నారు. తనను చూస్తే పారిశ్రామిక వేత్తలు వస్తారని.. జగన్‌ను చూస్తే పారిపోతారని విమర్శించారు. ‘మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రంలో ప్రధాని మోడీ పుట్టారు. గాంధీ అసత్యం చెప్పరు.. మోడీ సత్యం చెప్పరు. గాంధీది అహింసావాదం.. మోడీది హింసావాదం’అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరంపై కేసీఆర్‌ సుప్రీంకోర్టులో రెండు కేసులు వేశారని.. ఆ ప్రాజెక్టుతో భద్రాచలం మునిగిపోతుందంటూ ఫిర్యాదు చేశారన్నారు. గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా తమదేనన్నారు. ఏపీకి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu