HomeTelugu Newsరాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉంది: చంద్రబాబు

రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉంది: చంద్రబాబు

9 7రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉందని, ప్రత్యర్థులు ఎవరైనా బయటకు వస్తే అందులో కొట్టుకుపోతారని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకిల్‌ స్పీడ్‌ను ఎవరూ తట్టుకోలేరన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లా కృష్ణా అని అన్నారు. త్వరలో బందరుకు పోర్టు రాబోతోందని ఆయన గుర్తు చేశారు. మొవ్వలో రూ. 100 కోట్లతో కూచిపూడి కళాక్షేత్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

‘కోటి మంది ఆడబిడ్డలు ఉన్న ఏకైక అన్నయ్యను నేను. వృద్ధులకు శాశ్వతంగా పెద్దకొడుకుగా ఉంటా. అన్ని రకాల బాధితులకు పింఛన్లు ఇచ్చాం. రాష్ట్రం కోసం 5 ఏళ్లు కష్టపడ్డాను’ అని చంద్రబాబు అన్నారు. కుట్రలు చేస్తున్న వారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు 12 గంటల కరెంటు ఉచితంగా ఇస్తామని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ బ్యాంకు పెడతామని హామీ ఇచ్చారు. దేవాలయాల్లోని అర్చకులకు సొంతిళ్లు నిర్మిస్తామని తెలిపారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా పోర్టులు, విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

‘రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. మోడీ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు. విపక్ష పార్టీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలవరాన్ని ప్రధాని మోడీ ఏటీఎంగా అభివర్ణించారు. అది ఏటీఎం కాదు.. ఏటీడబ్ల్యూ ( ఎనీటైం వాటర్‌)‌’ అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పనులకు అడ్డం పడుతున్నారని, అలాంటి వ్యక్తితో జగన్‌ కలిసి వెళుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘జగన్‌ ఎప్పుడైనా అమరావతి వచ్చారా? ఇక్కడున్నారా? ఆయన అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి అవుతుందా?’ అని ఓటర్లను ప్రశ్నించారు. అభ్యర్థులు, కార్యకర్తలు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తే పట్టించుకోకుండా.. అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థిగా ఉన్నట్లు భావించి టీడీపీకి ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu