కిడారి శ్రవణ్‌కి బాబు సూచన

శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కిడారి శ్రవణ్‌కు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చిన్న వయస్కుడువైనా మంత్రిగా అవకాశం ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ముస్లిం మైనార్టీ నేతలతో సీఎం భేటీ అయ్యారు. వారికి కీలక పదవులు ఇస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఇప్పటికే మంత్రి పదవి ఖరారు కాగా.. శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాను ఖరారు చేశారు. మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఫరూక్‌ శాసనమండలి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు వారికి మంత్రి వర్గంలో చోటుకల్పించే విషయంలో జాప్యం జరగడానికి కారణాలను వివరించారు. మంత్రి పదవులు ఆశించినా రాని ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి మద్దతుగా ముస్లింలను సమీకరించుకొని వెళ్లాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.