వారెంట్‌ పై టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

బాబ్లీ ఎపిసోడ్, వారెంట్ల జారీ అంశంపై రాష్ట్ర మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. వారితో సమాలోచనలు జరిపారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు, వారెంట్లు ఏమైనా వచ్చాయా ? అని సీఎం అధికారులను ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు, వారెంట్లు జారీ కాలేదని వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం తాజాగా జారీ అయిన అరెస్ట్ వారెంట్ అందినట్టుగా చంద్రబాబుకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అనగా.. ప్రత్యామ్నాయాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు సీఎం కు సూచించినట్టు సమాచారం. రీకాల్‌ పిటిషన్‌ వేస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆయన దృష్టికి తెచ్చారు. ఒకవేళ చంద్రబాబు కోర్టుకు హాజరైతే ఆయన వెంట రైతులూ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ టీడీపీ నేతలు సీఎంతో అన్నారు. మంగళవారం మరోసారి నేతలతో చర్చించి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.