ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. కడప విమానాశ్రయం నుంచి తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని హత్యకు గురైన టీడీపీ కార్యకర్త భాస్కర్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధిచెబుతారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటాం. తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదు. ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పైనా దాడి చేశారు. ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పైనా దౌర్జన్యానికి పాల్పడ్డారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. తాడిపత్రి నుంచి కాసేపట్లో చంద్రబాబు బత్తలపల్లికి వెళ్లనున్నారు. మే 31న హత్యకు గురైన టీడీపీ కార్యకర్త గుల్ల రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

అంతకుముందు కడప విమానాశ్రయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వైకాపా నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీకి సహకరించిన ప్రజలపై కూడా వైసీపీ దాడులు చేస్తోందన్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియాపైనా దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితవు పలికారు.