చరణ్ సెట్‌లో సందడి చేసిన మెగాస్టార్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌, సతీమణి ఉపాసన ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అయితే గురువారం చరణ్‌ సినిమా సెట్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారట. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మామయ్యతో డిన్నర్‌. అందరం నలుపు రంగు దుస్తులు ధరించాం. జార్జియా వెళ్లడానికి ముందు మెగాస్టార్‌.. రామ్‌చరణ్‌ సెట్స్‌కు వచ్చారు’ అని క్యాప్షన్‌ ఇస్తూ అందరూ కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. ఇందులో ఆర్యన్‌ రాజేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ కొత్తగా కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చెర్రీ భారీగా వర్కవుట్స్‌ చేసి తన పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.